Prabhas Pawan Kalyan (Photo : Google)
Prabhas Pawan Kalyan : హీరోల మీద అభిమానం హద్దులు మీరింది. ఒకరిని మరొకరు చంపుకునే వరకు వెళ్లింది. మితిమీరిన అభిమానం మర్డర్ కి దారితీసింది. ఒక టాప్ హీరో అభిమాని.. మరో అగ్ర హీరో ఫ్యాన్ ని హత్య చేయడం కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో దారుణం జరిగింది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. అది కాస్తా హత్యకు దారితీసింది.
ఏలూరుకు చెందిన పెయింటర్లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే వ్యక్తి ఇంటికి పెయింట్స్ వేస్తూ ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో ఒకరు చనిపోయారు. మూడు రోజుల క్రితం పెయింటర్లు హరికుమార్, కిషోర్.. అత్తిలి వెళ్లారు. పెయింటర్ హరికుమార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్. దాంతో అతడు తన వాట్సాప్ లో ప్రభాస్ వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నాడు.(Prabhas Pawan Kalyan)
ఇక మరో పెయింటర్ కిషోర్ ఏమో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని. నేను పవన్ ఫ్యాన్ ని, నువ్వు కూడా ప్రభాస్ వీడియో తీసి పవన్ వీడియోని స్టేటస్ గా పెట్టుకో అని హరికుమార్ ను కోరాడు కిషోర్. దానికి హరికుమార్ ఒప్పుకోలేదు. నేను ప్రభాస్ కి వీరాభిమానిని, ప్రభాస్ వీడియోనే పెట్టుకుంటాని తేల్చి చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో దీనిపై గత రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. హరికుమార్ కోపంతో ఊగిపోయాడు. సెంట్రింగ్ కర్రతో కిషోర్ తలపై బలంగా కొట్టాడు. అంతేకాదు సిమెంటు రాయితో ముఖం మీద కొట్టాడు. అంతే, తీవ్రగాయాలతో కిషోర్ స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ఘటన తర్వాత హరికుమార్ అక్కడి నుంచి పారిపోయాడు.
Also Read..Andhra Pradesh : రూ.2 లక్షల 50వేలు లంచం తీసుకొని గంజాయి వాహనాన్ని వదిలేసిన ఎస్సై..
రంగంలోకి దిగిన తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హరికుమార్ ను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. హీరోల పేర్లు చెప్పుకుని మర్డర్లు చేసుకోవడం షాక్ కి గురి చేసింది. హీరోలపై అభిమానం ఉండటం తప్పు కాదు, కానీ, అభిమానం పేరుతో ఇలా మర్డర్లు చేసుకోవడం ఏంటో అని తలపట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.