ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు.. ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ...

AP Speaker Ayyanna Patrudu : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి అయ్యన్న పాత్రుడు పేరును ప్రకటించారు. అనంతరం సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ లు అయ్యన్న పాత్రుడిని గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఇదిలాఉంటే.. అయ్యన్న పాత్రుడును స్పీకర్ గా ఎన్నికచేసే ప్రక్రియకు వైసీపీ దూరంగా ఉంది. దీంతో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు.

Also Read : వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్ .. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయ్యన్నకు నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1983 నుంచి ఇప్పటివరకూ 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. పట్టభద్రుడైన అయ్యన్నపాత్రుడు.. ఇప్పటి వరకూ ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రిగా సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీలోకి పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్..! ఎవరీ కృష్ణతేజ..

రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావులు శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం వీరు ప్రమాణ స్వీకారంకు హాజరుకాలేక పోయారు. దీంతో రెండోరోజు సమావేశాలు ప్రారంభైన వెంటనే వారితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.

 

ట్రెండింగ్ వార్తలు