Baby Death At Child Care Home in Anantapur
Baby Death At Child Care Home in Anantapur : ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తనకు జన్మించిన మగ శిశువును ముళ్లపొదల్లో వదిలేసింది. దీంతో స్థానికులు ప్రభుత్వ శిశుగృహానికి అప్పగించారు. అయితే, ఆ పసికందు ప్రాణాలుకోల్పోయాడు. నెలరోజుల పసికందు ఆయమ్మల గొడవ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, పసికందు మృతిని కప్పిపుచ్చడానికి మృతదేహాన్ని పూడ్చేయగా.. వారి మధ్య గొడవలతో ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆమె.. విచారణకు ఆదేశించారు. శిశు గృహంలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయాడని వచ్చిన మీడియా కథనాలపై సమగ్ర విచారణకు మంత్రి ఆదేశించారు. వారి మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణంఅనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి తెలిపారు.
పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణం అని సంబంధిత అధికారులు చెపుతున్నందున దీనిపైనా పూర్తి స్థాయి విచారణ చేయాలని, శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణం అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి
స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించమని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..?
ఓ మహిళ తనకు జన్మించిన మగ శిశువును ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లగా.. స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆగస్టు 30వ తేదీన అనంతపురంలోని ఐసీడీఎస్ అనుబంధ శిశుగృహంకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ శిశువు ఇక్కడే ఉంటున్నాడు. దసరా పండుగ రోజున రాత్రి డ్యూటీలో ఇద్దరు ఆయమ్మలు ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్క ఆయమ్మ మాత్రమే విధుల్లోకి వచ్చారు. అయితే, అర్ధరాత్రి సమయంలో పసికందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పసికందు మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు.
పసికందు మృతి విషయం బయటకు రాకుండా శ్మశానంలో పూడ్చిపెట్టారు. అయితే, సిబ్బంది మధ్య గొడవలతో విషయం బయటకు వచ్చింది. వీరిద్దరి మధ్య గొడవల కారణంగా నిర్లక్ష్యంతో శిశువుకు పాలు పట్టకపోవడం వల్లనే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు.. శిశువు అనారోగ్యం కారణంగానే మరణించినట్లు ఐసీడీఎస్ పీడీ పేర్కొంది. అయితే, ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉన్నతాధికారులను ఆదేశించారు.