Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారంటూ పోసానిపై కేసులు నమోదయ్యాయి.

Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేసింది కడప మొబైల్ కోర్టు. అంతేకాదు పోసాని కస్టడీ పిటిషన్ ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది.

మరోవైపు పోసాని కృష్ణమురళి కస్టడీకి నరసరావుపేట కోర్టు అనుమతించింది. రెండు రోజుల కస్టడీకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు నరసరావుపేట టూ టౌన్ పోలీసులు పోసానిని విచారించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ని గతంలో దూషించిన కేసులో అరెస్ట్ అయిన పోసాని.. ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు.

ఈ నెల 13వ తేదీ వరకు నరసరావుపేట కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోసాని కృష్ణమురళిని విచారించాల్సిన అవసరం ఉందని జడ్జి ముందు వాదనలు వినిపించారు ప్రభుత్వ న్యాయవాదులు. కేసులో ఛార్జ్ షీట్ వేశారని, పోసాని కృష్ణమురళిని విచారించాల్సిన అవసరం లేదంటూ వాదనలు వినిపించారు పోసాని తరపు న్యాయవాదులు.

ఇక, పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటీషన్ పై వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ ని సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది నరసరావుపేట కోర్టు.

Also Read : ప్రమాదపు అంచున శ్రీశైలం ప్రాజెక్ట్..? ఏపీ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కీలక ఆదేశాలు

అటు, ఇప్పటికే హైకోర్టులో పోసానికి ఊరట లభించింది. పోసానిపై విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులకు సంబంధించి క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తాను ఏదీ తప్పుగా మాట్లాడలేదని, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రస్తావించానని, తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పోసాని కృష్ణమురళి కోర్టుని అభ్యర్థించారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మరో 14 కేసులు ఉన్నాయి.

తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు పోసాని. తనపై ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తనకు వర్తించవని, తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారంటూ పోసానిపై రాష్ట్రంలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వాటిని క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. తనపై రాజకీయ ద్వేషంతోనే తప్పుడు కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్న పోసాని.. ఆయా కేసుల్లో 41ఏ నోటీసులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.