Srisailam Project: ప్రమాదపు అంచున శ్రీశైలం ప్రాజెక్ట్..? ఏపీ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కీలక ఆదేశాలు

ప్రాజెక్టు మరమ్మతు పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ ఆదేశిం చారు.

Srisailam Project: ప్రమాదపు అంచున శ్రీశైలం ప్రాజెక్ట్..? ఏపీ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కీలక ఆదేశాలు

Srisailam project

Updated On : March 7, 2025 / 2:35 PM IST

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచున ఉందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జాతీయ ఆనకట్ట భద్రత సంస్థ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ ఏడాది క్రితమే ఈ విషయాన్ని చెప్పింది. తాజాగా తెలంగాణ ఈఎన్సీ శ్రీశైలం డ్యామ్ ప్రమాదపు అంచున ఉన్నా ఏపీ పట్టించుకోవడం లేదంటూ ఎన్డీఎస్ఏకు లేఖ రాయడంతో.. ఏడాది కిందట నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది.

 

2024 ఫిబ్రవరి నెలలో ఎన్డీఎస్ఏ సభ్యులు (విపత్తుల నిర్వహణ) వివేక్ త్రిపాఠి నేతృత్వంలో నిపుణుల కమిటీ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించింది. ఆ నెలలోనే నివేదిక ఇచ్చారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం.. శ్రీశైలం జలాశయం కింద భూగర్భంలోని రాతిఫలకాల మధ్య బలహీన అతుకులు ఉన్నాయని, అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్ పునాదులు రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. అంతేకాక.. డ్యామ్ దిగువన ఏర్పడిన భారీ గొయ్యి 120 మీటర్ల లోతు ఉందని, డ్యామ్ పునాదులకన్నా కిందకు ఆ గుంత విస్తరించి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జలాశయం భద్రత దృష్ట్యా తక్షణమే తగిన అధ్యయనాలు చేసి, మరమ్మతులకు చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. అదేవిధంగా డ్యామ్ మరమ్మతుల సమయంలో తీసుకోవాల్సిన పలు సిఫార్సులను కమిటీ సూచించింది.

 

శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతు పనులు, పొంచిఉన్న ప్రమాదంపై తెలంగాణ ఈఎన్సీ(జనరల్) అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ నుంచి ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ వర్చువల్ విధానంలో గురువారం సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. వానాకాలంలోపు మరమ్మతులు పూర్తి చేసేందుకు వీలుగా ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని, మే ఆఖరులోగా పనులు పూర్తి చేయాలని అనిల్ జైన్ ఏపీ అధికారులకు సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జరిగే నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, ప్రాజెక్టు వద్ద ప్లంజ్ పూల్ ను పూడ్చేందుకు శుక్రవారం నుంచే రంగంలోకి దిగాలని ఏపీ జలవనరుల శాఖ నిర్ణయించింది. గొయ్యి పూడ్చివేతకు వినియోగించిన టెక్నాలజీపై మేదోమధనం చేపట్టనున్నట్లు తెలిసింది.