Bandla Ganesh (Image Credit To Original Source)
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేశ్ రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లోని తన ఇంటి నుంచి తిరుమల వరకు సంకల్పయాత్ర చేపట్టారు. పాదయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇది రాజకీయ యాత్ర కాదని అన్నారు.
“దేవుడికి మొక్కు చెల్లించుకునేందుకు సంకల్పయాత్ర చేపట్టాను. చంద్రబాబుపై అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లిస్తున్నాను. నా సంకల్ప యాత్రకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నాకు ఉదయం 4.30 గంటలకే నిద్ర లేచే అలవాటు ఉంది.
గతంలో లేచి టీవీ చూడగానే చంద్రబాబు అరెస్ట్ అయిన వార్త చూసి షాక్‌కు గురయ్యాను. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఆయన. చంద్రబాబును అరెస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోయాను. గుంటూరుకు తీసుకొచ్చి బెయిల్ ఇస్తారనుకున్నాను.
రాజమండ్రికి తరలించి జైలుకు పంపించారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఏం చేస్తారోనని భయమేసింది. ప్రతిరోజు, ప్రతిక్షణం చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారా? అని ఎదురుచూశాను. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని వార్త మొదట వినడానికి ఢిల్లీ వెళ్లి కూర్చునేవాడిని.
జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప వరకు నడుచుకుంటూ వస్తానని ఏడుకొండలవాడికి మొక్కుకున్నా. ఏడుకొండల వాడి ఆశీస్సులతో 52 రోజుల తర్వాత జైలు నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు.
తెలుగు ప్రజల కోసం నేనున్నానంటూ చంద్రబాబు ఎంతో ఉత్సాహంతో బయటకు వచ్చారు. చంద్రబాబులాంటి వ్యక్తి తెలుగు జాతికి చాలా అవసరం. నా మొక్కు తీర్చుకోవడం కోసమే సంకల్పయాత్ర చేపట్టాను” అని తెలిపారు.