బరి గీస్తే ఖతమే: పొగురెక్కిన భీమవరం పుంజుతో పోటీనా?

  • Publish Date - January 14, 2020 / 09:33 AM IST

సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల జోరు మొదలైంది. బరిలో దిగేందుకు కోడిపుంజులు రెడీ అవుతున్నాయి. పందెం రాయుళ్ల తమ కోళ్లను పందానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రత్యేకించి బీమవరం పుంజులకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. భీమవరం పుంజు బరిలో దిగిందంటే చాలు.. ఆ కిక్కే వేరంటారు అక్కడివారంతా.. భీమవరం పుంజులకు పొగరెక్కువే కాదు.. బరిలో దిగితే ప్రత్యర్థి పుంజు బలాదూర్ కావాల్సిందే మరి. అలాంటి భీమవరం పుంజులంత బలిష్టంగా ఉండటానికి వాటిని పెంచే పెంపకందారులు ఏమి పెడుతారు ఎలా శిక్షణ ఇస్తారో తెలుసుకోవాలని ఉందా? 

భీమవరం పుంజులకు బాగా పొగురెక్కువ. బరిలోకి దిగితే ఎదుట ప్రత్యర్థి పుంజులను మట్టికరిపించేవరకు ఊరుకోవు. అంతగా వాటికి శిక్షణ ఇస్తారు పందెం రాయుళ్లు.. ఈ పుంజులకు రోజు కఠోర శిక్షణతో పాటు బలవర్థకమైన ఆహారాన్ని ఇవ్వడం.. క్రమతప్పకుండా కసరత్తులు చేయించడం వంటివి చేస్తారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే ముందుగానే కోళ్లకు మంచి గిరికి ఉంటుంది.

ముఖ్యంగా ట్రైనింగ్ పొందిన కోళ్లను ఇంక చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోని వారంతా ఇక్కడికి వచ్చి పుంజులను కొనుగోలు చేస్తుంటారు. ప్రముఖులు సైతం ప్రత్యేకించి భీమవరంలో పుంజులను కొంటుంటారు. ఎందుకంటే.. ఈ కోడిపుంజులను సంక్రాంతి కోడి పందాల కోసమే పెంచుతుంటారు. అందుకే ఈ కోళ్లకు అంత క్రేజ్ మరి. 

పోటాపోటీగా.. సై అంటే సై :
భీమవరం పుంజులకు ఎంత పొగరు ఉంటుందో అంతే తెగువ ఉంటుంది. ధరలోనూ అంతే దూకుడు మీద ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పందె రాయుళ్లు ఇక్కడికి వచ్చి పొగరు మీదన్న పుంజులను కొనేస్తుంటారు. పుంజు రకం ఆధారంగా కోడిపుంజ ధర ఉంటుంది. ఒక్కో పుంజు ధర రూ.15 వేల నుంచి రూ. 50వేల వరకు పలుకుతుంది.

కోడి పుంజు కావాల్సినవారంతా ముందుగా అడ్వాన్స్ ఇచ్చేసి నచ్చిన పుంజును ఎంపిక చేసుకుంటారు. సంక్రాంతి సీజన్ వస్తే చాలు.. కోళ్ల పెంపకం దారులకు ఫుల్ గిరాకీ ఉంటుంది. సాధారణంగా కోళ్ల పందాల్లో వినియోగించే కోళ్లపుంజుల్లో ఎరుపు, నలుపు రకాల్లో పచ్చకాకి, నల్ల నెమలి, పింగలి, సేతువా, కక్కరాయి ఇలా పిలుస్తారు. అలాగే తెలుపు, ఎరుపు రంగుల్లో అబ్రాస్, మైల, డేగ, పండు డేగ, నల్ల బొట్టుల తేతువా, గేరువా, రసంగి, పెట్టమర్రు, కాకి డేగ పర్ల, పర్ల ఇలా ఎన్నో రకాల పుంజులను పందాల్లో వాడుతుంటారు. 

కోళ్లకు పెట్టే ఆహారం ఇదే :
పందె కోళ్లకు ఇచ్చే ఆహార నియమాల్లో ప్రత్యేకత ఉంటుంది. మటన్ కైమా, బాదం, జీడిపప్పు, కోడిగుడ్డు, చోళ్లు, గంట్లు, వడ్డు ఇలా అన్నింటిని కలిపి క్రమం తప్పకుండా ఆహారంగా ఇస్తుంటారు. ప్రతిరోజు ఈ కోళ్లకు మటన్ ఖైమా ఉండాల్సిందే. ఉదయం పూట బాదం, మటన్ కైమా, సాయంత్ర పూట గంట్లు, చోళ్లు ఆహారంగా పెడుతుంటారు.

ఉదయం పూట పుంజులతో ఈత కొట్టిస్తారు. కత్తులు లేకుండా డిక్కీ పందాలు నిర్వహిస్తుంటారు. మామాలు  కోళ్లతో పందాలు నిర్వహిస్తారు. ఇలా కఠినమైన శిక్షణ ఇస్తూనే.. పుంజు ఏ మేరకు పందాల్లో బలంగా నిలవగలదు అనేదానిపై ఒక అంచనాకు వస్తారు. ఆ తర్వాతే కోళ్ల పందాలకు వీటిని ఉసికోల్పుతారు.