Bhogapuram International Airport (Image Credit To Original Source)
Bhogapuram International Airport: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. 96% పనులు ముగియడంతో ఆదివారం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
ఈ ఎయిర్‌పోర్ట్‌ను సుమారు 2,200 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రోగ్రాంకి హాజరు కానున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్ కానున్న నేపథ్యంలో ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చే విమానంలో రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పల్ నాయుడు వస్తారు.
ఎన్నో ప్రత్యేకతలు
రన్‌వే కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. ప్రయాణికుల రద్దీని భవిష్యత్తులో కూడా సమర్థంగా నిర్వహించేలా డిజైన్ చేశారు. 3.88 కిలోమీటర్ల రన్‌వే, 3 కిలోమీటర్ల టాక్సీవే, 55 మీటర్లలో ఏటీసీ ఉన్నాయి.
తొలిదశలో 6 మిలియన్ల ప్యాసింజర్లను హ్యాండిల్ చేసే విధంగా ఈ టెర్మినల్స్ ను రూపొందించారు. లగేజ్‌కు సంబంధించి నేరుగా ఎక్కడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా.. లగేజ్ ఆ ఫ్లైట్లోకి వెళ్లి మళ్లీ ఫ్లైట్‌లో నుంచి ప్యాసింజర్‌కు చేరే విధంగా రూపొందించారు. పర్యావరణ హితంగా మొత్తం బిల్డింగ్‌లను డిజైన్ చేశారు.
ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రవాణా కనెక్టివిటీ, వ్యాపార, టూరిజం లాంటివాటిలోనూ కీలక పాత్ర పోషిస్తుందని అంటోంది. విమానాశ్రయం ఆరేడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.