APPSC Group2 Exams : ఆదివారం ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ఏపీపీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని, వాయిదా వేసే ప్రసక్తే లేదని ఏపీసీఎస్సీ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు కమిషన్ కీలక సూచన చేసింది.
ఎగ్జామ్ సమయానికి ముందుగానే.. అంటే 15 నిమిషాల ముందే పరీక్ష సెంటర్లకు చేరుకోవాలంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ – 2 ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఏపీసీఎస్సీ సూచించింది. 92వేల 250 మంది పరీక్షకు హాజరుకానున్నారు.
Also Read : రైల్వేలో ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు TTE జాబ్‌కు అప్లయ్ చేయొచ్చు.. నెలకు రూ.80వేల వరకు జీతం..!
గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లు ఏర్పాటు చేసింది కమిషన్. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పడంతో అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని కాస్త ముందుగానే తమ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడం మంచిది. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
కాగా, ఫిబ్రవరి 23న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపై తీవ్ర ఉత్కంట నడిచింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఉంటాయా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి.. గ్రూప్ 2 యథాతథంగా ఉంటుందని ఏపీసీఎస్పీ తేల్చి చెప్పింది. అయితే, అభ్యర్థుల ఆందోళలను దృష్టిలో ఉంచుకుని మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కమిషన్ కు లేఖ రాసింది.
దానికి కమిషన్ బదులిచ్చింది. ఆదివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేయలేము అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. అందుకే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 ఎగ్జామ్ యథాతథంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
Also Read : పాక్ మీద ఇండియా తోపే.. కానీ ఆ ఒక్కడి వల్లే కొంచెం టెన్షన్..
2023లో గ్రూప్-2 పరీక్షల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రోస్టర్ పాయింట్ల విధానంలో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దాకే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కూటమి సర్కార్ ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11న జరగనుంది. అప్పటివరకు వేచి చూడాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఈ పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వేయలేమని బదులిచ్చింది కమిషన్.
రాష్ట్రంలో 899 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో గ్రూప్ 2 మెయిన్స్ ఆగిపోయింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న (ఆదివారం) నిర్వహిస్తామన్నారు.