హమ్మయ్య.. ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద, ఊపిరిపీల్చుకున్న బెజవాడ జనం..!

వందేళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు.

Prakasam Barrage : గత మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. ఇవాళ శాంతించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువున ఉన్న తీర ప్రాంతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా నదికి వరద నీరు భారీగా తగ్గడంతో విజయవాడ, లంక గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. నిన్న 11 లక్షల 47వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోయింది.

ఎగువ ప్రాంతంలో వరద నీరు తగ్గడంతో ప్రకాశం బ్యారేజీకి గణనీయంగా వరద నీరు తగ్గింది. వందేళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నీరు పోటెత్తడంతో గత రెండు రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి.

వరద సృష్టించిన బీభత్సం నుంచి విజయవాడ ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. అటు బుడమేరు, ఇటు కృష్ణా నదికి వరద తాకిడి క్రమేపీ తగ్గుతోంది. కృష్ణా నదికి నిన్న ఈ సమయానికల్లా 11లక్షల 47వేల క్యూసెక్కుల వరద నీరు పొంగి ప్రవహించింది. ఇవాళ ప్రవాహం 9లక్షల క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీ 70 గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్లుగానే సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ ప్రాంతాలు శ్రీశైలం, పులిచింతల నుంచి భారీగా వరద నీరు రావడంతో నిన్న ఈ సమయానికి 11లక్షల క్యూసెక్కుల వరద నీరు రావటం వందేళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇదే తొలిసారి.

గతంలో రెండు సందర్భాల్లో కేవలం 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చింది. ఈసారి దాదాపుగా 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు రావడంతో మొత్తం బెజవాడ అల్లకల్లోలంగా మారింది. కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా అలజడికి గురైంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన దాదాపు 11లక్షల ఎకరాల రైతాంగం కన్నీరుమున్నీరుగా విలపించిన పరిస్థితి. ఖరీఫ్ పంట పూర్తిగా నీళ్లలోనే నానుతోంది. లంక గ్రామాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి.

వరద నీరు పోటెత్తడంతో ప్రజలు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ వరద ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి 2లక్షల 47వేల క్యూసెక్కుల వరద నీరు తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. క్రమేపీ వరద నీరు తగ్గుతోంది. సాయంత్రానికి ఇది 6లక్షల క్యూసెక్కులకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బుడమేరులో కూడా వరద నీరు తగ్గుతోంది.

Also Read : బుస కొట్టిన బుడమేరు, ముంచెత్తిన మున్నేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలకు కారణం ఏంటి?

ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ను సచివాలయంగా మార్చుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ దింపేశారు. ప్రభుత్వమే కదిలి వచ్చింది. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బుడమేరు ప్రాంతంలోనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రోజుకు 3, 4 సార్లు వరద ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్తున్నారు. ప్రతి బాధితుడిని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా ఇస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు