TDP Leaders - Angallu Case
TDP Leaders – Angallu Case : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు భారీ ఊరట లభించింది. వారికి బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఉన్న 79మంది టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు గురువారం బెయిల్ ఇచ్చింది. బెయిల్ పై రిలీజ్ అయిన వారు ప్రతీ మంగళవారం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది కోర్టు. ఇవే కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం మరో 30మంది తెలుగుదేశం నేతలు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, వారందరిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.
చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఘర్షణలు జరిగాయి. ఇందులో పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు చంద్రబాబు కారణమని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు 20మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఘర్షణలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వైసీపీ నాయకుడు ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.
పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అంగళ్లులో ఆగస్టు 5న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జగన్ సర్కార్ అలక్ష్యం చేస్తోందని టీడీపీ ఆరోపించింది. సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టారు. ఈ క్రమంలోనే పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో చంద్రబాబు పర్యటనకు వెళ్లిన సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు గొడవపడ్డారు. చంద్రబాబు రూట్ మార్చి రావడంతో ఈ ఘర్షణ జరిగిందని పోలీసులు కేసు పెట్టారు.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కామ్ లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ పిటిషన్ ను అడ్డం పెట్టుకుని ఏసీబీ కోర్టులో మిగిలిన పిటిషన్లపై విచారణను ముందుకెళ్లనివ్వడం లేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో పీటీ వారెంట్ తో పాటు ఇతర పిటిషన్ల కింద కోర్టు పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు.
Also Read..Nara Lokesh : చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో బెయిల్ పిటిషన్ కు, కింది కోర్టు ప్రొసీడింగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ముకుల్ రోహత్గీ. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి కింది కోర్టులో పిటిషన్లకు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో బెయిల్ పిటిషన్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. కింది కోర్టు యధావిధిగా ఇన్నర్ రింగ్ రోడ్ లోని పీటీ వారెంట్, ఇతర పిటిషన్ల మీద విచారణ జరపొచ్చని పేర్కొంది.