Tirumala Temple
Tirumala Temple : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ భారీ సంఖ్యలో తిరుమలకు తరలివెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ, విదేశాల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల (Tirumala Temple) కు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటుంటారు. తిరుమల కొండ (Tirumala hill)పై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పటిష్ఠ చర్యలు తీసుకుంటుంది. సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనభాగ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటుంది.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. మార్చి 3వ తేదీన శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది. మార్చి3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం మూసివేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని భక్తులు గమనించి యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ తెలిపింది.
3వ తేదీన సాయంత్రం 3.20గంటల నుంచి సాయంత్రం 6.47గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణానికి 6గంటలు ముందుగా అంటే.. 3వ తేదీ ఉదయం 9గంటల నుంచే తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది. దాదాపు 10.30 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేసి ఉంటుంది.
3వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ తరువాత శుద్ది, పుణ్యహవచనం అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనం పున:ప్రారంభం ఉంటుంది.
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలలు రద్దు చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమల యాత్రకు ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ సూచించింది.