Bhogapuram Airport : ఎగిరే చేప డిజైన్.. 200 విమానాలు ల్యాండయ్యే సామర్థ్యం.. భారీ తుఫాన్లు తట్టుకునే కెపాసిటీ.. భోగాపురం విమానాశ్రయం ప్రత్యేకతలు మరెన్నో..
Bhogapuram Airport : ఏపీలో విమానయాన రంగానికి కీలక మైలురాయిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. విశాఖపట్టణం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది.
Bhogapuram Airport
- మత్స్యం ఆకారంలో భోగాపురం విమానాశ్రయం
- భారీ తుపాన్లను తట్టుకునేలా డిజైన్
- వచ్చే జూన్ 26న ప్రారంభించేందుకు ఏర్పాట్లు
- అంతర్జాతీయ స్థాయి వసతులతో ఎయిర్ పోర్టు నిర్మాణం
Bhogapuram Airport : ఏపీలో విమానయాన రంగానికి కీలక మైలురాయిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రయల్ రన్‌గా ఇవాళ తొలి కమర్షియల్ విమానం దిగనుంది.
ఆదివారం ఉదయం 10.15గంటల సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఇతర విమానయాన శాఖ అధికారులతో ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది.
భోగాపురంలో నిర్మితవుతున్న ఈ విమానాశ్రయం అత్యంత ఆధునిక సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. విశాఖపట్టణం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. 24గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ , వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది.
ప్రారంభం ఎప్పుడంటే..?
భోగాపురం విమానాశ్రయానికి 2023 మే3వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయంకోసం 2,708.26 ఎకరాల భూమిని కేటాయించారు. తొలుత ఈ ఏడాది డిసెంబర్ నాటికి విమానాశ్రయం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ 26న ఎయిర్ పోర్టును ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

విమానాశ్రయానికి ప్రత్యేకతలెన్నో..
ఎయిర్ పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే రన్ వే, ఏటీసీ, టెర్మినల్ బిల్డింగ్ సహా 96శాతం పనులు పూర్తయ్యాయి. మట్టి పనులు 100శాతం పూర్తవ్వగా.. సుందరీకరణ పనులతో విమానాశ్రయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ భోగాపురం విమానాశ్రయం మత్స్యం ఆకారంలో నిర్మాణం చేశారు. హుద్‌హుద్ వంటి తుపాన్లను తట్టుకునేలా విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు. గంటలకు 275 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. 27సెంటీమీటర్ల వర్షం కురిసినా నీరు బయటకు వెళ్లిపోయేలా డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాత్రిపూట 18 విమానాలు పార్కింగ్ చేసుకొనేలా ఏర్పాట్లు చేశారు. 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సెల్ఫ్ బ్యాగేజీ, బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, స్మార్ట్ ట్రాలీలు తదితర ఆధునిక వసతులు ఉంటాయి.
అధికారికంగా విమానాల రాకపోకలు ఎప్పుడంటే?
వచ్చే జూన్ నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తిచేసి విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు అధికారులు నిర్ణయించారు. తద్వారా ఈ ఏడాది జులై తొలి వారం నుంచి అధికారికంగా విమానాల రాకపోకలు కొనసాగనున్నాయి. ఈ విమానాశ్రయంలో టెక్నికల్ బిల్డింగ్ విస్తీర్ణం 81వేల చదరపు మీటర్లు ఉండగా.. రన్‌వే పొడవు 3.8కిలో మీటర్లు. దేశంలో అతిపెద్ద మూడో రవ్‌వే గుర్తింపు పొందనుంది. ఈ విమానాశ్రయంలో 21 ఆధునిక ఏరో బ్రిడ్జిలు ఉన్నాయి.
తొలి ఏడాది టార్గెట్ ఇదే?
ఈ విమానాశ్రయం రోజుకు 200 విమానాలుదిగే సామర్థ్యం కలిగి ఉంది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రతీయేటా 20వేల టన్నుల సరుకు ఎగుమతులకు అవకాశం ఉంటుంది. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాది 60లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు జంట నగరాలుగా అవతరించనున్నాయి. భోగాపురం రెండు నగరాలకు దాదాపు సమాన దూరంలో ఉండటంతో వీటి మధ్య అంతరం తొలగనుంది.
ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకూ..
భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం జిల్లాతోపాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా వాసులకు విమానయాన సేవలు మరింత చేరువకానున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులకూ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉపయోగకరం కానుంది. ఏపీలోని జిల్లాలతోపాటు.. దక్షిణ ఒడిశాలోని కొరాపుట్, గంజాం, మల్కాన్‌గిరి, గజపతి, రాయగడ, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్ పూర్ ప్రాంత ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంటుంది.
