మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమై చర్చించారు. పలు కీలక అంశాలను ప్రస్తావనకు వచ్చాయి.
అనంతరం చంద్రబాబు నాయుడు తన స్పందనను తెలిపారు. బిల్‌గేట్స్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏపీ సర్కారు, గేట్స్ ఫౌండేషన్ ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చ జరిపామని చెప్పారు.
ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలలో సేవలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగంపై చర్చించామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌ను సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
Also Read: తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట.. ఆ కేసు కొట్టివేత
గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం ఈ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాము నమ్ముతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిల్ గేట్స్ అందిస్తానన్న సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పురోగతిపై చర్చించడానికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.
మరోవైపు, ఇవాళ పార్లమెంటులో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా బిల్ గేట్స్ కలిశారు. బిల్ గేట్స్ మూడు సంవత్సరాలలో భారతదేశంలో చేస్తున్న మూడో పర్యటన ఇది. ఆయన ఎవరెవరిని కలుస్తారన్న విషయాలపై క్లారిటీ లేదు.