హై అలర్ట్.. బర్డ్ ఫ్లూగా నిర్ధారణ.. చికెన్ తినడం తగ్గించాలి.. ఆ షాపులు మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశాలు

అక్కడి పౌల్ట్రీ నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్స్(కోళ్లు), కోడిగుడ్లను కాల్చి వేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

గోదావరి జిల్లాల్లో కొన్ని రోజులుగా వైరస్‌ సోకి కోళ్లు చనిపోతున్న ఘటనలపై నిపుణులు నిగ్గు తేల్చారు. కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు.

పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్ కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా పూణె ల్యాబ్‌లో నిర్ధారణ అయింది. దీంతో రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను 95429 08025 నంబర్ తో ఏర్పాటు చేశారు.

బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా అధికారులకు సమాచారాన్ని అందించాలనీ హై అలర్ట్ జారీ చేశారు. ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్ట్రీ ఫాంలో రోజుకు 10 వేలకు పైగా మృతి చెందుతున్నాయి.

కానూరు శాంపిల్స్ కు ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్. పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా విధించారు.

ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఆయా పౌల్ట్రీ నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్స్(కోళ్లు), కోడిగుడ్లను కాల్చి వేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 75 శాతం వాటిని కాల్చి వేశారు పౌల్ట్రీ యజమానులు. పలు ప్రాంతాల కోళ్ల శాంపిల్స్ కు ఇంకా ల్యాబ్ రిపోర్ట్ లు రావాల్సి ఉంది. చికెన్ షాపులు మూసివేయాలని అధికారులు నోటీసులు ఇస్తున్నారు.