Bhanu Prakash Reddy (Photo Credit : Google)
Ys Jagan Declaration Issue : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై రాజకీయ రగడ ముదురుతోంది. డిక్లరేషన్ పై సంతకం చేశాకే జగన్ శ్రీవారి దర్శనం చేసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు వినతిపత్రం ఇచ్చారు బీజేపీ నేతలు. మరోవైపు తిరుమల లడ్డూ వివాదం చంద్రబాబు కుట్ర అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రేపు తిరుమలకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఎల్లుండి స్వామి వారిని దర్శించుకోనున్నారు. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
లడ్డూ వివాదం, జగన్ తిరుమల పర్యటనపై బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ”శ్రీవారికి సప్లయ్ చేస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ఏమీ తెలియదన్నట్లుగా జగన్ తిరుమల వస్తున్నారు. మాది ఒక్కటే డిమాండ్. స్వామి వారి పవిత్రతను దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధ పడే విధంగా వ్యవహరించిన జగన్.. హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కొండపైకి అడుగు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Also Read : 3 నెలల తర్వాత సడెన్‌గా ప్రత్యక్షమైన కొడాలి నాని, వంశీ.. ఆ ధైర్యంతోనే బయటకు వచ్చారా?
అంతేకాదు, అన్యమతస్తులు ఎవరైనా తిరుమల వస్తే.. టీటీడీలో స్వామి వారిని నేను నమ్ముతున్నాను, వెంకన్నపై నాకు నమ్మకం ఉందని చెబుతూ డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే. వైఎస్ జగన్ సైతం డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిందే. ఆ తర్వాతే దైవ దర్శనం చేసుకోవాలి” అని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ తిరుపతి పర్యటనను అడ్డుకుని తీరతామని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలు స్వయంగా టీటీడీ ఈవోని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి, హిందూ మతం పట్ల విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ ఇవ్వాలి, ఆ తర్వాతే కొండపైకి అనుమతించాలని ఈవోను కోరారు బీజేపీ నేతలు.
”బీజేపీ ప్రతినిధి బృందం టీటీడీ ఈవో శ్యామలరావుని కలిసింది. టీటీడీలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం.. అన్యమతస్తులు ఎవరైనా తిరుమల వస్తే.. స్వామి వారిని నేను నమ్ముతున్నా, స్వామి వారిపై నమ్మకం, విశ్వాసంతో నేను దర్శనానికి వెళ్తా అని ఒక డిక్లరేషన్ ఉంది. దానిపై సంతకం చేసిన తర్వాత మాత్రమే వారిని స్వామి వారి దర్శనానికి అనుమతించాలి. అది కూడా జగన్ ను అలిపిరి దగ్గరే డిక్లరేషన్ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. జగన్ హయాంలో తిరుపతిని పూర్తిగా వ్యాపార కేంద్రంగా మార్చారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారు. ఆరోజు ఉన్న టీటీడీ బోర్డు, ఈవో దీనికి బాధ్యత వహించాలి. వీరిని నియమించిన జగన్ మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి” అని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.