3 నెలల తర్వాత సడెన్‌గా ప్రత్యక్షమైన కొడాలి నాని, వంశీ.. ఆ ధైర్యంతోనే బయటకు వచ్చారా?

కొడాలి నాని, వంశీ ఒకేసారి బయటకు రావడం కూటమి నేతలకు చాలెంజ్‌ విసరడమే అంటున్నారు. ఇకపై వారు ఏం చేస్తారో... ఎలా నడుచుకుంటారో.. ప్రభుత్వ స్పీడ్‌ను ఎలా బ్రేక్‌ చేస్తారనే ఉత్కంఠ పెంచేస్తోంది.

3 నెలల తర్వాత సడెన్‌గా ప్రత్యక్షమైన కొడాలి నాని, వంశీ.. ఆ ధైర్యంతోనే బయటకు వచ్చారా?

Gossip Garage Kodali Nani And Vallabhaneni Vamsi Re entry (Photo Credit : Facebook)

Updated On : September 25, 2024 / 9:36 PM IST

Gossip Garage : ఆ ఇద్దరూ బయటకు వచ్చారు. ఎక్కడున్నారు? ఏమయ్యారు? అనే సస్పెన్స్‌కు తెరదించారు… భయపడ్డారని… అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని… దేశంలోనే లేరని జరిగిన ప్రచారమంతా వట్టి ఊహాగానాలే అని కొట్టిపడేస్తూ మెరుపులా మెరిశారు… పొలిటికల్‌ సర్కిల్స్‌ను ఆశ్యర్యానికి గురిచేశారు. ఆ ఇద్దరి సడన్‌ ఎంట్రీతో ఇటు స్వపక్షం.. అటు అధికార పక్షం కూడా షాకయ్యాయట.. ఇంతకీ ఆ ఇద్దరి ఎంట్రీ అంత షాకింగ్‌గా ఎందుకు మారింది…? అందరికీ షాకిచ్చిన ఆ ఇద్దరి స్టోరీ ఏంటి..

అదే.. వారిని ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్‌గా మార్చింది..
ఆ ఇద్దరూ వైసీపీకి లౌడ్‌ స్పీకర్లు… అధికార కూటమికి ప్రధాన టార్గెట్‌. వారే మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వంద రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారని… దేశంలోనే లేరని జరిగిన రకరకాల ప్రచారానికి తెరదించుతూ వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో మెరిశారు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ. గత ప్రభుత్వంలో ఈ ఇద్దరి సౌండ్‌.. రాష్ట్ర రాజకీయాల్లో రీ సౌండ్‌ ఇచ్చేది. అదే వారిని ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్‌గా మార్చింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాత కేసులన్నీ తిరగతోడటం, కొత్తగా వరుస కేసులు నమోదు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంద రోజులుగా కనిపించకుండా పోయారు.

ఇన్నాళ్లు జరిగిన ప్రచారం అంతా ఉత్తిదేనా?
వారి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు, మధ్యలో ఓసారి వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లు ప్రచారం జరిగినా, ఆ తర్వాత అదంతా ఉట్టిదే అని తేలిపోయింది. మాజీ మంత్రి కొడాలిపై రెండు కేసులు నమోదైతే ఆ రెండింటికీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేనికి ఇప్పటివరకు బెయిల్‌ మంజూరు కాలేదు. దీంతో ఆయన మూడు నెలలుగా ఎవరికీ అందుబాటులో లేకుండా తిరుగుతున్నారని టాక్‌ నడుస్తోంది. అరెస్టు భయంతో తన ఆచూకీ తెలియకుండా ఫోన్‌ కూడా వాడకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకే సారి ప్రత్యక్షమవడంతో ఇన్నాళ్లు జరిగిన ప్రచారం అంతా ఉత్తిదేనా? అనే చర్చ జరుగుతోంది.

తనలో ఫైర్‌ ఉందని.. ప్రభుత్వానికి భయపడలేదని సంకేతాలిచ్చారు..
మాజీ మంత్రి కొడాలికి ప్రస్తుతం అరెస్ట్ ముప్పు లేదనే చెబుతున్నారు. ఐతే ప్రభుత్వం ఏదైనా కేసు పెట్టి ఆయన అరెస్టుకు ప్రయత్నించవచ్చనే టాక్‌ ఉంది. ఇదే సమయంలో ఆయన ఇంటిపై కోడి గుడ్లతో దాడి చేయడంతోపాటు కొడాలి అనుచరులు ఆధీనంలో ఉన్న భూములు, కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి సమయంలో కూడా సంయమనం పాటించిన నాని.. బయటకు రాలేదు. అయితే తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీని ప్రభుత్వం కార్నర్‌ చేయడంతో ఎట్టకేలకు బయటకు వచ్చారు నాని. అధినేత జగన్‌ సమక్షంలో జరిగిన కృష్ణ జిల్లా పార్టీ సమీక్ష సమావేశానికి రావడంతోపాటు యథావిధిగా తన విమర్శల దాడి కొనసాగించారు. తనలో ఫైర్‌ ఉందని.. ప్రభుత్వానికి భయపడలేదని సంకేతాలిచ్చారు.

100 రోజుల తర్వాత కనిపించడంతో అంతా షాక్‌..
ఇక మాజీ మంత్రి కొడాలి నాని మాదిరిగానే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పార్టీ సమావేశానికి వచ్చారు. వంశీ కూడా గత వంద రోజులుగా ఎక్కడా కనిపించలేదు. ఆయన దేశం విడిచి వెళ్లిపోయారని ఒకసారి.. హైదరాబాద్‌లో అరెస్టు అయ్యారని మరోసారి ప్రచారం జరిగింది. అదే సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ఇప్పటివరకు తన ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడిన వంశీ.. జగన్‌తో సమావేశంలో తళుక్కుమన్నారు. దీంతో ఆయనకు బెయిల్‌ రక్షణ వచ్చిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరులు అంతా అరెస్టు అయ్యారు. బెయిల్‌ వచ్చినా, రాకపోయినా వంద రోజుల తర్వాత వంశీ కనిపించడంతో అంతా షాక్‌ అయ్యారు.

Also Read : తిరుమల లడ్డూ వివాదం.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం, కాలినడకన తిరుమలకు..

కోర్టు రక్షణతో ఇద్దరూ ప్రస్తుతానికి సేఫ్‌ అనే ప్రచారం..
కొడాలి నాని, వంశీ ఒకేసారి బయటకు రావడం కూటమి నేతలకు చాలెంజ్‌ విసరడమే అంటున్నారు. ఇన్నాళ్లు అనవసర రాద్ధాంతం ఎందుకనే ఆ ఇద్దరూ సైలెంట్‌గా ఉన్నట్లు చెబుతున్నారు వైసీపీ నేతలు. ఏదైతే అదే జరిగిందనే ధైర్యంతో… పార్టీ క్యాడర్‌కు అండగా నిలవాలనే ఆలోచనతోనే ఇద్దరూ మళ్లీ యాక్టివ్‌ అయ్యారంటున్నారు. ఇదే సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకేసారి కనిపించడంతో ప్రభుత్వం అలర్ట్‌ అయిందంటున్నారు. మొత్తానికి కోర్టు రక్షణతో ఇద్దరూ ప్రస్తుతానికి సేఫ్‌ అనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్నాకే పార్టీ సమావేశానికి హాజరయ్యారంటున్నారు. ఏదైఏమైనా ఆ ఇద్దరి సడన్‌ ఎంట్రీ పొలిటికల్‌ సర్కిల్స్‌ను ఆకట్టుకుంది. ఇకపై వారు ఏం చేస్తారో… ఎలా నడుచుకుంటారో.. ప్రభుత్వ స్పీడ్‌ను ఎలా బ్రేక్‌ చేస్తారనే ఉత్కంఠ పెంచేస్తోంది.