Daggubati Purandeswari
BJP Rayalaseema Declaration : రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గతంలో ఇచ్చిన హామీల మేరక సాధన దిశగా బీజేపీ పని చేస్తుందని తెలిపారు. విభజన హామీలన్నింటినీ అమలు చేశామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఏమి ఇచ్చామో స్పష్టంగా పేర్కొన్నామని వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బీజేపీ రాయలసీమ జోన్ సమావేశానికి దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు.
ఏపీలో పొత్తుల విషయంలో ఢిల్లీ నాయకత్వం ఏమి నిర్ణయిస్తే ఆ మేరకు పనిచేస్తామని చెప్పారు. వైసీపీకి బీజేపీ సహకరిస్తోందని జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏ విధంగా సహాయ, సహకారం ఇవ్వాలో అదే చేస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ వైఫల్యాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ కేడర్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. మొదటి సారి కడపకు వచ్చానని తెలిపారు. అధ్యక్షురాలిగా జోన్ల వారీగా సమావేశాలు జరుపుతున్నానని వెల్లడించారు.
ఎన్టీఆర్ రాయలసీమ ముద్దు బిడ్డగా, దత్త పుత్రుడుగా ప్రకటించుకున్నారని పేర్కొన్నారు. అలాంటి రాయలసీమ కర్మ భూమి అని.. ఇక్కడి నుంచే తన భాద్యతలు మొదలు కావడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ అన్నీ వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న పార్టీ అని అన్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందరికీ మేలు చేయాలని చేపట్టిన పథకాలను ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నట్లు తెలిపారు. తరతమ బేధాలు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.
“నేను ప్రధాని కాదు ప్రధాన సేవకుడిని” అని మోదీ ప్రకటించారు.. మోదీ అడుగు జాడల్లో ఇక్కడ అందరం పనిచేస్తాం” అని తెలిపారు. ఏపీకి అన్నీ విధాలుగా సహాయ, సహకారాలు కేంద్రం అందిస్తోందన్నారు. 22 లక్షల ఇళ్లు ఏపీకి ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించారని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు మద్యపానం దశల వారీగా నిషేధిస్తామన్నారు… ఇప్పుడు దాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
Pawan Kalyan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు
రాష్ట్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి వర్గాల జేబులు ఖాళీ చేస్తోందని విమర్శించారు. మైనింగ్ లను మూయించి వైసీపీ తనవారికి కట్ట బెట్టిందన్నారు. పంచాయతీల నిధులు దారి మళ్లించారు, విద్యుత్ బిల్లులు, ఎల్ఈడీ బల్బుల పేరుతో వసూలు చేస్తున్నారని.. ఇది దారుణ పరిస్థితి అన్నారు. ముగ్గురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. సాగు నీటి విషయంలో పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం లేదని విమర్శించారు. రాయలసీమలో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
వర్షాధార ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మొన్నటి వరదల్లో కొట్టుకు పోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ ను ఇంకా పునర్ నిర్మించ లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అన్నారు. జిల్లాలో గండి కోట ప్రాజెక్ట్ లో నీళ్ళు ఉంచుతున్నా సరఫరా చేయడానికి కెనాల్ లు లేవన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా తామే స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు..కానీ ఇప్పటిదాకా పూర్తి కాలేదని తెలిపారు. రాయలసీమలో ఉపాధి లేక ప్రజలు వలసలు పోతున్నారని పేర్కొన్నారు.
తిరుపతిలో ఐఐటీ, కల్లూరులో ట్రిపుల్ ఐటీ, ఓర్వకల్లులో సోలార్ ప్రాజెక్ట్, కడప, కర్నూలు విమానాశ్రయానికి కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. రాయలసీమ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలు, హైవేలను కలిపే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తాము ఎంతో సహకారం అందిస్తున్నాం.. కాబట్టి ప్రశ్నిస్తున్నామని తెలిపారు. చంద్రయాన్ ప్రయోగం తరువాత తీసిన ఫొటో రాష్ట్రంలో రోడ్లు బాగాలేని ఫొటో వచ్చిందంటే.. రోడ్లు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.