CM Ramesh: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి కాంట్రాక్ట్ పనుల అంశంలో తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నేను కాంట్రాక్ట్ పొందాను అనేది పూర్తి అవాస్తవం అన్నారు. అసలు రిత్విక్ కంపెనీకి, తనకు సంబంధమే లేదన్నారు. అంతేకాదు కేటీఆర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెల్లెలి పోరుతో కేటీఆర్ కు మతిభ్రమించిందన్నారు. 4 నెలల క్రితం ఢిల్లీలో మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడావో గుర్తుందా? అని కేటీఆర్ ను నిలదీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా చేయడంతో పాటు కవితను జైలు నుంచి వదిలేస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను కలపడానికి సిద్ధమని అనలేదా? అని కేటీఆర్ ను ఎంపీ రమేశ్ ప్రశ్నించారు. కేటీఆర్ విజ్ఞప్తితో నేను మా పార్టీ పెద్దలతో చర్చించానని తెలిపారు. కేటీఆర్ విజ్ఞప్తికి మేము ఒప్పుకోకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రమేశ్ అన్నారు. ఏపీలో జగన్ తో కలిసి ప్రయాణిస్తున్నామని నాతో చెప్పలేదా? అని కేటీఆర్ ను నిలదీశారు.
బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో నాకు తెలుసు అని అన్నారు. కాంట్రాక్ట్ పొందిన వాళ్లలో తెలంగాణ వాళ్లు ఎంతమంది ఉన్నారో, ఏపీ వాళ్లు ఎంతమంది ఉన్నారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని సీఎం రమేశ్ చెప్పారు. కేసీఆర్ ఆరోపణలపై మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమన్నారు సీఎం రమేశ్. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
”తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1,660 కోట్ల కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి నాపై ఆరోపణలు చేయడం మూర్ఖత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నేను కాంట్రాక్ట్ పొందానేది అవాస్తవం. అసలు ఆ కంపెనీకి, నాకు సంబంధం లేదు. ఆంధ్రాలో జగన్ కు చెల్లెలితో పోరు ఉన్నట్టే తెలంగాణలో మీకు కూడా చెల్లెలితో పోరు ఉంది. దాంతో మతిభ్రమించి మాట్లాడుతున్నావు.
Also Read: ఒక్కొక్కరి బొక్కలు ఇరుగుతాయ్..: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాస్ వార్నింగ్
తెలంగాణలో ఎల్ అండ్ టీ, రిత్విక్ కంపెనీలకు వర్క్ కాంట్రాక్ట్ వచ్చి మూడు నెలలైంది. ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తుందో పదేళ్లు మంత్రిగా పని చేసిన నీకు తెలియదా? నాలుగు నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన నువ్వు ఏం మాట్లాడారో గుర్తుందా? మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలో మీ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావు.. అవునా? కాదా?
నేను మా పార్టీ పెద్దలతో చర్చించి మీది అవినీతి పార్టీ అని, తెలంగాణలో మీ పని అయిపోయిందని, మీతో మాకు పని లేదని చెప్పడం వల్లే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నావు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో మీరు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచారో నన్ను చెప్పమంటారా? తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని మిమ్మల్ని అడిగితే మా పార్టీకి కమ్మ వాళ్లు అవసరం లేదని నువ్వు అన్నావు. రేవంత్ గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని అన్నావు. ప్రస్తుతం ఏపీలో జగన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా? లేదా?
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తుతో పని చేస్తాయని అప్పుడు బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవని తెలిసే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నావు. మీ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే రా.. నువ్వు చెప్పిన వాటిసై మీడియా సమక్షంలో చర్చిద్దాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. అనవసరంగా నన్ను కెలికితే ఇంకా నీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుంది” అంటూ కేటీఆర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎంపీ సీఎం రమేశ్.