తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సేఫ్ గేమ్

ఆంధప్రదేశ్‌లో బీజేపీ వ్యూహాలు పార్టీ నేతలకే అర్థం కావడం లేదంటున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో వెళ్లాల్సి వస్తుందో తెలియక తికమక పడిపోతున్నారు. ఒక్కోసారి ఒక్కో రకమైన విధానాలు అవలంబిస్తూ ఏం జరుగుతుందో అర్థం కాని రీతిలో ఆ పార్టీ సాగుతోందని అంటున్నారు. రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోందనే విమర్శలూ లేకపోలేదు. మరోపక్క తెలంగాణలోనూ పార్టీ విధానానిది ఇదే పరిస్థితి. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ స్థానిక నేతలు వాగ్దానాలు చేస్తుంటే కేంద్రం మాత్రం టీఆర్ఎస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలోనూ వైసీపీ పట్ల తటస్థ వైఖరి చూపిస్తూ ఊగిసలాడుతుందని అంటున్నారు.
బీజేపీకే వైసీపీతో అవసరం:
వైసీపీ లోక్‌సభ సభ్యులతో కేంద్రంలో బీజేపీకి పని లేదు. కానీ, రాజ్యసభ సభ్యులతో మాత్రం బీజేపీకి చాలా అవసరాలే ఉన్నాయి. పైగా ఏప్రిల్‌లో వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి బాగా తగ్గి వైసీపీకి అన్ని సీట్లూ రాబోతున్నాయి. అందువల్ల వైసీపీ రాజ్యసభ సభ్యులతో బీజేపీకి కచ్చితంగా పని ఉంటుంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంపై బీజేపీ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. ఈ బలహీనతతో పాటు వైసీపీని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం మరో వైపు బీజేపీని కుంగదీస్తుందని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే వైసీపీని పూర్తి స్థాయిలో బీజేపీ కట్టడి చేయడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు.
పవన్ బలహీనతలను వాడుకోవాలని:
వైసీపీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విపరీతమైన స్పందన వస్తున్నది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం పెరుగుతోంది. పవన్ వెనుక ఉండేదంతా యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి ఎంతో కొంత విశ్వాసం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. పవన్‌కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్థిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. వీటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. తమ గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్‌ను కూడా కట్టడి చేయొచ్చనే ప్లాన్‌లో బీజేపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.
కర్రా విరగదు.. పాము చావదు:
అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడంపై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బీజేపీ ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చేలా మాట్లాడారు. జీవీఎల్ వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బీజేపీ పూర్తిగా నీరుగారిపోయింది. ఉద్యమం చేస్తున్న పవన్‌ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం ద్వారా ఏపీలో ఎదిగే అవకాశాన్ని బీజేపీ చేజేతులా జారవిడుచుకుందని అంటున్నారు.
సాగదీతే సో బెటర్:
మరోసారి తనకు అంది వచ్చిన అవకాశాలను పాడుచేసుకుంటోందని బీజేపీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో బీజేపీకి ఎదిగే అవకాశం వచ్చింది. కాకపోతే ఇప్పుడు అమరావతి తరలింపు, తదితర అంశాలకు పరోక్షంగా మద్దతిస్తూ తన ఎదుగుదలను తానే నిరోధించుకుంటోందని అంటున్నారు. ఇప్పుడు అమరావతి విషయంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఏ అంశాల్లోనూ కేంద్రం జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీలూ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే అవకాశమే లేనందున తమకు అర్జెంటుగా వచ్చిన అసాయమేమీ లేదని బీజేపీ అంచనా వేస్తోందట. అందుకే మూడు స్తంభాల ఆటను రాబోయే నాలుగున్నర ఏళ్లు కూడా సాగదీయాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమట.
అధికార పార్టీలకు అండగా ఉండాలని:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువు. అందువల్ల కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసే అవకాశమే లేదని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ అడుగులు కాంగ్రెస్ వైపు పడనంత కాలం తమకు ఇబ్బందేమీ లేదన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. అలాగే ఏపీలో అధికార వైసీపీకి ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ గత ఎన్నికలలో కాంగ్రెస్‌తో అంటకాగింది. అంతే కాకుండా తనను జైలుకు పంపింది సోనియాగాంధీ అని బలంగా నమ్ముతున్న జగన్ కూడా కాంగ్రెస్ వైపు వెళ్లరని భావిస్తోంది. అందుకే తమకొచ్చిన నష్టమేమీ లేనప్పుడు రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఇబ్బందులను పెట్టడం ఎందుకని బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చేశారట.
అది కష్టం.. ఇలా కానిచ్చేద్దాం:
ఇప్పటికప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం గానీ, అత్యధికంగా ఎంపీ సీట్లు గెలవడం కుదిరే పని కాదని బీజేపీ పెద్దలకు అర్థమైపోయిందంట. అందుకే ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరీ ఎక్కువ కార్యక్రమాలు చేసే అవకాశం లేదంటున్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు ఆటంకాలు ఏర్పరిస్తే కాంగ్రెస్ పుంజుకుంటుంది. అలానే ఆంధ్రాలో జగన్‌కు ఆటంకం కలిగిస్తే బీజేపీకి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆ లాభమంతా తెలుగుదేశం పార్టీకి పోతుంది. అందుకే బీజేపీ ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ అంశం మీదనైనా నానింపు ధోరణినే అనుసరిస్తుందని జనాలు అనుకుంటున్నారు.
Read More>> త్రివిక్రమ్ తో తారక్ 30 – 2021 వేసవిలో విడుదల!