BJP vs YSRCP: ఇదే సరైన సమయం. వైసీపీతో మనకు ఎలాంటి చీకటి ఒప్పందం లేదు. అంతర్గత దోస్తీ అంతకంటే లేదు. ఈ విషయం ఏపీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కాషాయం బలపడాలంటే ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకు మనకు టర్న్ కావాల్సిందే. వైసీపీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లాలంటే ఆ పార్టీపై సాఫ్ట్ కార్నర్ ఉంటే కుదరదు. వైసీపీకి ఇచ్చి పడేస్తేనే ఏపీ పొలిటికల్ పిచ్‌లో సెట్ అయిపోవచ్చు.
ఇప్పుడిదే ప్లాన్‌తో ఉందట బీజేపీ. మొన్నటి దాక పొత్తులు..మద్దతు అంటూ ఊగిసలాడిన కమలనాథులు నవ్యాంధ్రలో బలపడడానికి ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నారట. వైసీపీ అపోజిషన్‌లో ఉన్నప్పుడే ఆ పార్టీని మరింత వీక్ చేస్తే..టీడీపీకి షిఫ్ట్ కాని వైసీపీ ఓటర్లంతా తమకు వైపు మళ్లుతారని లెక్కలు వేసుకుంటున్నారట. ఈ పొలిటికల్ గేమ్‌తోనే ఏపీ సెంట్రిక్‌గా పెద్ద గేమ్ స్టార్ట్ చేసిందట బీజేపీ.
వైసీపీని బీజేపీ రాజకీయంగా దూరంగానే పెడుతోంది. 2024 ఎన్నికల వేళ కూడా గుంటూరులో జరిగిన సభలో మోదీ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ప్రభుత్వం అని నాడు బీజేపీ పెద్దలు అన్నారు. అదే నిజమని ఇప్పుడు మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ వేదికగా వైసీపీ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ సారి ఇంకాస్త డోస్ పెంచారనే చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో ఏపీలో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపారని..వైసీపీది అసమర్థ అస్తవ్యస్తమైన పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మోదీ, అమిత్‌షాతో సహా బీజేపీ అగ్రనేతలెవరూ ఇప్పటివరకు ఈ స్థాయిలో వైసీపీని టార్గెట్ చేయలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో నడ్డా చేసిన కామెంట్స్ ఇప్పుడు కమలం క్యాడర్‌లో జోష్‌ను నింపుతున్నాయి. వైసీపీని ఒక డెత్ ట్రాప్‌గా అభివర్ణించారు నడ్డా.
కూటమిగానే ఉంది. కేంద్రంలో టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతోనే అధికారంలో కొనసాగుతోంది బీజేపీ. అయితే ఏపీలో ఒంటరిగా బలపడి డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉండాలని..అవసరమైతే సొంతంగా అధికారంలోకి వచ్చేంత స్ట్రాంగ్ కావాలని కలలు కంటోంది కమలం పార్టీ. ఇప్పుడు తమ బలం పెంచుకోవడానికి..కూటమిగానే ఉంటామంటోంది.
అలా అని రాజకీయ వ్యూహాల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. కూటమిని డిస్ట్రబ్ చేయకుండా..సొంతంగా బలపడాలంటే వైసీపీని టార్గెట్ చేయడం తప్ప మరో మార్గం లేదని డిసైడ్ అయిపోయింది కమలం పార్టీ. వైసీపీకి 40 శాతం ఓటింగ్ ఉంది. ఆ పార్టీ ఓటు బ్యాంకును తమవైపునకు తిప్పుకునే స్కెచ్ వేస్తోంది బీజేపీ. అందుకు అనుగుణంగా గతంలో ఏ బీజేపీ జాతీయ నాయకుడు చేయని విధంగా జేపీ నడ్డా వైసీపీని టార్గెట్ చేశారు. ఏకంగా వైసీపీని ఎమ్మెల్సీనే చేర్చుకుని..గత వైసీపీ పాలనపై నడ్డా సహా నేతలంతా తీవ్ర విమర్శలు చేయటం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ 40 శాతం పొలిటికల్ వాక్యూమ్ మీదే కమలనాథులు ఫోకస్ పెట్టినట్లు క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. వైసీపీ విషయంలో సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నా.. విమర్శలు చేయకుండా ఉన్నా తమకే నష్టమని భావిస్తున్నారట బీజేపీ నేతలు. భవిష్యత్‌లో వైసీపీ బలపడటం, తిరిగి అధికారంలోకి రావడమన్న సంగతి తర్వాత..ఇప్పుడు ఏపీలో మనం బలపడాలి. అంతకంటే ముందు ఏపీ ప్రజలు మనల్ని నమ్మాలని పెద్ద వ్యూహమే రచిస్తున్నారట. ఇక నుంచి మీటింగ్ ఏదైనా..విషయం మరేదైనా వైసీపీ టార్గెట్‌గా అటాక్ మొదలు పెట్టకపోతే పొలిటికల్‌గా పికప్ అవడం కష్టమని లెక్కలు వేసుకుంటున్నారట.
కూటమిలోనే ఉన్నా.. జగన్‌తో బీజేపీ అగ్రనేతలకు సన్నిహిత సంబంధాలున్నాయని ఇన్‌సైడ్ టాక్ నడుస్తుంటుంది. జగన్ మీద బీజేపీ ఏ యాక్షన్ తీసుకోవడం లేదు.. తీసుకోలేదన్న గుసగుసలు ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ ఏపీలో తమ రాజకీయ శత్రువు వైసీపీనే అని బీజేపీ క్లియర్ కట్‌గా చెప్పేస్తోంది. ఆ పార్టీ ఓటు బ్యాంకు టార్గెట్‌గానే ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయని కమలనాథులు చెప్పకనే చెప్తున్నారు.
ఇప్పటికే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్..రాయలసీమ నుంచే తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు. జగన్ ఇలాకాగా, వైసీపీ కంచుకోటగా పేరున్న రాయలసీమలో ఆ పార్టీ ఓటు బ్యాంకులో చీలిక తెస్తే వైసీపీ వీక్ అయి తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీ ఓటు బ్యాంకును తమవైపునకు టర్న్ చేసుకోవాలని బీజేపీ వేస్తున్న ఎత్తులు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి మరి.