Blast
Srikakulam శ్రీకాకుళం టెక్కలిలోని కచేరీ వీధిలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలవ్వగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితులను వాకాడ హరి, సాయిగోపాల్, మూర్తిగా గుర్తించారు. మరికొంత మందికి స్వల్ప గాయాలైనట్లుగా చెబుతున్నారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరీరంలో పలుచోట్ల కాలిన గాయాలతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీపావళికి ముందు క్రాకర్స్ విక్రయించడానికి వారు ఒడిశాలోని పర్లాకిమిడి మెటీరియల్‌ను తెచ్చినట్లు తెలుస్తుంది.
ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన శ్రీకాకుళం పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ అక్రమ క్రాకర్ల తయారీ యూనిట్‌లపై వెంటనే దాడులు నిర్వహించాలని అన్నీ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు ఆదేశాలు జారీచేశారు. శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక అధికారులు కూడా దీపావళి నేపధ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు.