Bonded Labour : ఏపీలో దారుణం జరిగింది. వెట్టిచాకిరి ఘటన వెలుగుచూసింది. 15 ఏళ్లుగా కేవలం తినడానికి తిండి మాత్రమే పెట్టి వెట్టి చాకిరి చేయించుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఈ ఘోరం వెలుగుచూసింది. వృద్ధ దంపతులు నంబూరు పద్మ, అగ్ని తాము పడ్డ కష్టాలను తెలిపారు. దాదాపు 15 సంవత్సరాలుగా తమను బంధించి పనిలో ఉంచారని వారు ఆరోపించారు. ఈ ప్రాంతంలోని 400కి పైగా గిరిజన కుటుంబాలపై జరుగుతున్న విస్తృత, క్రమబద్ధమైన దోపిడీని వెలుగులోకి తెచ్చింది.
బాపట్ల కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశంలో ఉద్యోగం కోసం తమను తమ స్వస్థలమైన బొబ్బర్లంక గ్రామం నుండి కృష్ణా జిల్లాలోని ఎలిసెటిదిబ్బకు తీసుకెళ్లారని ఆ జంట తెలిపారు. అక్కడ మడ అడవులలో పీతలు, అటవీ ఉత్పత్తుల కోసం వేటాడాల్సి వచ్చిందన్నారు. తమకు వేతనం ఇవ్వలేదని వాపోయారు. తినేందుకు కేవలం కొంత బియ్యం, కూరగాయలు మాత్రమే ఇచ్చారని చెప్పారు.
వెట్టి చాకిరీ చేయించుకోవడమే కాదు తమను చాలాసార్లు అమ్మేశారని వారు ఆరోపించారు. ఒక మధ్యవర్తి నుండి మరొక మధ్యవర్తికి 40వేలకి, మరొక వ్యక్తికి రూ.70వేలకి, చివరకి 1.2 లక్షలకు అమ్మేశారని కన్నీటిపర్యంతం అయ్యారు.
Also Read : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.1,332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులు..
గిరిజన కార్యకర్తల సాయంతో ఇటీవల తమ గ్రామానికి తిరిగి వచ్చేశామని, అయితే రూ.1.2 లక్షలు చెల్లించాలని లేదా బాండెడ్ లేబర్‌లోకి తిరిగి వెళ్లాలని తమను బెదిరించారని వృద్ధ దంపతులు ఆరోపించారు.
”ఈ కుటుంబాలు సంవత్సరాలుగా నిశ్శబ్దంగా, భయంతో జీవిస్తున్నాయి. ఈ బంధనం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మధ్యవర్తులు వారిని బెదిరిస్తూ వారి జీవితాలను నియంత్రిస్తున్నారు. వారికి రేషన్ కార్డులు, ఆధార్ లేదా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లేదా విద్య కూడా అందుబాటులో లేదు” అని టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీను చెప్పారు.
లంక వానిదిబ్బ, ఎలిసెటిదిబ్బ ప్రాంతాలలో 400 కి పైగా ఎస్టీ కుటుంబాలు ఇప్పటికీ దాదాపు ఒంటరిగా నివసిస్తున్నాయి. పీతలు, అటవీ ఉత్పత్తులను సేకరించడం ద్వారా జీవిస్తున్నాయి. స్వేచ్ఛ ఎలా ఉంటుందో వారికి తెలియదు. వారికి డబ్బు రూపంలో కాదు, మిగిలిపోయిన ఆహారం ద్వారా జీతం లభిస్తుంది. మరుసటి రోజు పనికి వారిని సజీవంగా ఉంచడానికి సరిపోతుంది” అని శ్రీను వాపోయారు.
Also Read : అమెరికా అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి.. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. ప్రియుడి కోసం అమెరికా నుంచి ఏపీకి వచ్చిన యువతి
వెట్టి చాకిరీ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంకట మురళి సీరియస్ అయ్యారు. రెవెన్యూ, పోలీసు, గిరిజన సంక్షేమం, కార్మిక శాఖలతో కూడిన ప్రత్యేక బృందంతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
”ఈ బృందం త్వరలోనే గ్రామాన్ని, వారు పని చేసిన ప్రదేశాలను సందర్శించి వాస్తవాలను గుర్తిస్తుంది. వాదనలు నిరూపిస్తే, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇతర కుటుంబాల దుస్థితి గురించి జిల్లా యంత్రాంగానికి ముందస్తు సమాచారం లేదు.దర్యాప్తు తర్వాతే వాస్తవాలు బయటపడతాయి” అని కలెక్టర్ స్పష్టం చేశారు.
ST కమిషన్ చైర్మన్ శంకర్ రావు వెట్టి చాకిరి ఘటనను తీవ్రంగా పరిగణించారు. వెంటనే వివరణాత్మక నివేదికను సమర్పించాలని బాపట్ల అధికారులను ఆదేశించారు. దీనిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఈరోజుల్లో గిరిజన వ్యక్తులను ఇప్పటికీ అమ్మేస్తున్నారు. బంధన కార్మికులుగా బలవంతంగా మార్చబడుతున్నారని వినడం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ పునరావృతం కాకూడదు” అని శంకర్ రావు అన్నారు.