boppana bhava kumar meet nara lokesh and announce to join tdp
Boppana Bhava Kumar : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు మారే నాయకులు తెర ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో పోటీ చేసే అవకాశం రాక, సరైన గుర్తింపు లేని నాయకులు జంప్ చేస్తున్నారు. తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఝలక్ ఇచ్చారు. వైసీపీ గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ ముందు నుంచి ఉన్న తమను పట్టించుకోవడం లేదని, వైసీపీలో ఎవ్వరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని ఆయన మీడియా ముందు వాపోయారు.
పార్థసారధితో కలిసి 21న టీడీపీలోకి
అంతకుముందు ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను భవకుమార్ కలిశారు. కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆయన వెంట ఉన్నారు. లోకేశ్ ను కలిసిన తర్వాత భవకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రేపు చంద్రబాబును కలుస్తానని చెప్పారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధితో కలిసి ఈ నెల 21వ తేదీన టీడీపీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. వైసీపీ కోసం పని చేసిన తనకు.. జలీల్ ఖాన్, పార్థసారధి, సామినేని ఉదయభానుకు గౌరవం లేకుండా పోయిందన్నారు. ప్రతి విషయంలోనూ అధినాయకత్వం తప్పులు చేయడంతో ఇప్పటికే ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారని చెప్పారు. విజయవాడ వైసీపీలో పెత్తనం మొత్తం ఒక్కరి చేతిలోకి పోయిందని, ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
boppana bhava kumar, nara lokesh
మానసిక క్షోభ అనుభవిస్తున్నా…
అమరావతికి ద్రోహం జరిగిన తర్వాత పార్టీలో ఉండలేకపోయానని, రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని భవకుమార్ తెలిపారు. విజయవాడ తెలుగుదేశం నేతలకు తాను సహాయకుడిగా ఉంటానని హామీయిచ్చారు. అవకాశవాద రాజకీయాలు చేయటానికి, ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరట్లేదని స్పష్టం చేశారు. వైసీపీ నుంచి వలసలు ఇంకా ఉంటాయని చెప్పారు.
gadde rammohan, boppana bhava kumar, nara lokesh, kesineni chenni
వైసీపీ ఖాళీ అవడం ఖాయం: కేశినేని చిన్ని
విజయవాడ పార్లమెంట్ సీటు పరిధిలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని కేశినేని చిన్ని అన్నారు. తాము గేట్లు ఎత్తితే కృష్ణా నది వరదలా వైసీపీ నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, సీట్ల సర్దుబాటుపై వారికి హామీ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు కావటంతో.. వైసీపీ మూడో ప్లేస్‌కి పరిమితమైనా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.