Borugadda Anil Kumar’s camp office: మంటల్లో బోరుగడ్డ అనిల్ కార్యాలయం.. ఇక్కడే ఉంటా.. మూల్యం చెల్లించక తప్పదు

Borugadda Anil Kumar: కోటంరెడ్డి శ్రీధర్, అతని తమ్ముడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గోళ్ళ అరుణ్ కుమార్ తన పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టించారని ఆయన ఆరోపించారు.

Borugadda Anil Kumar’s camp office: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయ్య వచ్చినా బెదిరేది లేదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్, అతని తమ్ముడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గోళ్ళ అరుణ్ కుమార్ తన పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టించారని ఆయన ఆరోపించారు. గుంటూరు డొంక రోడ్డులో ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు.

వంద రెట్లు మూల్యం చెల్లించక తప్పదు
మంగళవారం ఉదయం సంఘటనా స్థలాన్ని బోరుగడ్డ అనిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రపన్ని నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోటంరెడ్డి, నక్కా ఆనంద్ బాబు వంద రెట్లు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తనను చంపుతానంటూ రౌడీ షీటర్ మధు బెదిరించాడని.. తన వాచ్ మెన్, వంటమనిషి మీద పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేశారని తెలిపారు. తాను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మూడు రోజుల క్రితం బోరుగడ్డ అనిల్ కార్యాలయం వద్ద టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు.

మా పార్టీతో అనిల్ కు సంబంధం లేదు
బోరుగడ్డ అనిల్ కు తమ పార్టీతో సంబంధం లేదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు అంజయ్య చెప్పారు. తిరుపతిలో ఆయన 10టీవితో మాట్లాడుతూ.. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న అనిల్ అందుకు సంబంధించిన నియామక పత్రాలు చూపాలన్నారు. అంబేద్కర్ స్థాపించిన పార్టీ పేరు చెప్పుకుంటూ అనిల్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనిల్ పై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయని, ఉన్నతాధికారులను బెదిరించిన చరిత్ర అతడికి ఉందని వెల్లడించారు.

నెల్లూరులో నిరసన
బోరుగడ్డ అనిల్ కు వ్యతిరేకంగా ఏపీఎస్ యు విద్యార్థి నేతలు మంగళవారం నెల్లూరు అన్నమయ్య సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకుని చెదరగొట్టారు. కాగా, బోరుగడ్డ అనిల్ తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారని మూడు రోజుల క్రితం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్భలంతోనే అనిల్ రెచ్చిపోయాడని ఆరోపించారు. కోటంరెడ్డికి తాను ఫోన్ చేసిన విషయాన్ని అనిల్ కూడా ఒప్పుకున్నారు. అయితే తాను దుర్భాషలాడలేదని తెలిపారు.

Andhra Pradesh Govt Debts: ఏపీ అప్పుల చిట్టాను మరోసారి బయటపెట్టిన కేంద్రం.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?!

ట్రెండింగ్ వార్తలు