Botcha Satyanarayana - Skill Scam (Photo : Google)
Botcha Satyanarayana – Skill Scam : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ను బయటపెట్టింది మేము కాదు కేంద్ర సంస్థలే అని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అవినీతి చేశారు కాబట్టి చంద్రబాబుని అరెస్ట్ చేశారని అన్నారు. ధర్నాలు చేస్తే చంద్రబాబుని వదిలేయాలా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో గొడవ చేస్తే చంద్రబాబుని వదిలేస్తారా? అని టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీశారు మంత్రి బొత్స. భారత రాజ్యాంగంలో చట్టం ఉందని, దాని ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
”స్కిల్ స్కామ్ పై అసెంబ్లీలో చర్చ పెడితే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారు. చంద్రబాబు తప్పు చేశారని తెలుసు కాబట్టే వాళ్లు పారిపోయారు. వోక్స్ వ్యాగన్ కేసులో నేను ధైర్యంగా సీబీఐ ఎంక్వైరీ వేసుకున్నా. మీరెందుకు ఎదుర్కోలేకపోతున్నారు? ఇలాంటివి ప్రజాస్వామ్యంలో నిలబడవు. వ్యవస్థలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో ప్రజలకే కదా డబ్బులు పంచుతున్నాం” అని మంత్రి బొత్స అన్నారు.
ఇక సొంత పార్టీ నేతలను ఉద్దేశించి మంత్రి బొత్స సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామన్న మంత్రి బొత్స.. ఎమ్మెల్యే వద్దు – జగన్ ముద్దు అంటూ ఎవరైనా కార్యక్రమాలు చేస్తే క్షమించేది లేదని హెచ్చరించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి మంత్రి బొత్స మాట్లాడారు. ”జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న ఆదేశం. ప్రతీ ఇంటిని టచ్ చేస్తాం. అందరి ఆరోగ్యాన్ని తెలుసుకుంటాం. ప్రతీ గ్రామంలో మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తాం. పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం నడవనుంది. దేశ చరిత్రలో ఎవరూ ఆరోగ్యం కోసం ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టలేదు. మా నమ్మకం నువ్వే జగన్-ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అనేది మరో కార్యక్రమం. జన్మభూమి కమిటీల పేరుతో ఏ విధంగా దోచుకుతిన్నారో అందరికీ తెలుసు. నాయకులు గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలి” అని మంత్రి బొత్స అన్నారు.