Botcha Satyanarayana: పైడితల్లి సిరిమాను ఉత్సవంలో అధికారుల తీరుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు ద్వంద వైఖరి పాటించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కోసం కాకుండా ఏ ఒక్కరి కోసమో పండగ నిర్వహించారని ధ్వజమెత్తారు. ఆర్భాటం, అహంకారమే తప్ప సంప్రదాయాలు ఎక్కడా పాటించలేదని సీరియస్ అయ్యారు. ఇది నా ఒక్కడి మాట కాదు, ఎవరిని అడిగినా ఇదే చెబుతారని అన్నారు. ఇలా వ్యవహరించడం దురదృష్టకరం అని ఆయన వాపోయారు. ఒక్కో ఆఫీస్ లో ఒక్కో హుండీ పెట్టి మరీ వసూలు చేశారని అన్నారు.
గతంలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా..? అని నిలదీశారు. పండగ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందన్నారు. రాజకీయ నేతలు సరేసరి… అధికారులకు ఏమైంది..? అని బొత్స ప్రశ్నించారు. గతంలో ఎన్నో నీతులు చెప్పే.. ప్రస్తుత గోవా గవర్నర్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు..? అని బొత్స సత్యనారాయణ అడిగారు.
”అమ్మవారి సిరిమానోత్సవం కోసం వస్తున్నట్లు నా టూర్ ప్రోటోకాల్ విడుదల చేశాం. మాకు ఏర్పాటు చేసిన వేదిక కూలిపోయింది. నన్ను అవమానించాలనా? లేక నన్ను అంతమొందించాలన్న కుట్రతో జరిగిందా? అన్నది నాకు సమాధానం కావాలి. ప్రోటోకాల్ పాటించాలన్న బాధ్యత అధికారుల మీద లేదా? వేదిక కూలిపోవడం వల్ల ఒక ఎమ్మెల్సీకి గాయమైంది. ఒకరిద్దరికి గాయాలయ్యాయి. అమ్మవారి దయవల్ల ఎవరికీ ఏమీ జరగలేదు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎవరిది బాధ్యత? దీని వెనుక ఎవరున్నారన్న దానిపై అధికారులు సమాధానం చెప్పాలి.
ఘటన జరిగిన తర్వాత కూడా ఏం జరిగిందన్న దానిపై కనీసం ఆరా తీయలేదు. ఇది కేవలం ప్రభుత్వ అలసత్వం. అధికారులపై ఈ ప్రభుత్వానికి పట్టులేదు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. గవర్నర్ కి లేఖ రాస్తాం. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. డబ్బు లేదని చెప్పడం హాస్యాస్పదం. 2 లక్షల కోట్లు ఏం చేశారు? సామాన్య ప్రజల ఉసురు పోసుకోకూడదు. పీ4 విధానాన్ని అటకెక్కించేశారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో ఒకేసారి ఒకే పాఠశాలకు చెందిన 160 మంది పిల్లలు ఆసుపత్రిపాలైన దాఖలాలు ఉన్నాయా? ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యమే” అని నిప్పులు చెరిగారు బొత్స సత్యనారాయణ.
Also Read: నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్ జనార్దన్ అరెస్ట్.. సౌతాఫ్రికా నుంచి రాగానే..