Janardhan Rao Arrest: నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్ జనార్దన్ అరెస్ట్.. సౌతాఫ్రికా నుంచి రాగానే..

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జనార్ధన్‌ రావు ఏ1గా ఉన్నాడు.

Janardhan Rao Arrest: నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్ జనార్దన్ అరెస్ట్.. సౌతాఫ్రికా నుంచి రాగానే..

Updated On : October 10, 2025 / 8:03 PM IST

Janardhan Rao Arrest: ఏపీలో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్ధన్‌ రావుని.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జనార్ధన్‌ రావు ఏ1గా ఉన్నాడు. జనార్ధన్ ను గన్నవరం ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అతడి నుంచి కీలకమైన ఆధారాలు రాబడుతున్నారు. జనార్ధన్.. దక్షిణాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్నాడన్న సమాచారంతో గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రత్యేక బలగాలు మోహరించారు పోలీసులు. జనార్దన్ ఎయిర్ పోర్టులో దిగగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నకిలీ మద్యం అంశం కేంద్రంగా.. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. సీఎం చంద్రబాబును ఇరుకునపెట్టేలా తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. నకిలీ మద్యం తయారీ వెనుక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక ఈ కేసులో ఎక్సైజ్‌ అధికారులు ఏడుగురిని నిందితులుగా చేర్చారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డిని ఏ17గా, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిని ఏ18గా పేర్కొన్నారు. వీరితో పాటు బాలాజీ, అన్బురాసు, రవి, అష్రఫ్‌, సుదర్శన్‌లపై కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే 14 మందిపై ఎక్సైజ్‌ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏడుగురిని చేర్చడంతో నిందితుల సంఖ్య 21 చేరింది. ప్రధాన నిందితుల కోసం బెంగళూరులో నిఘా పెట్టారు.

Also Read: కూటమిని ఇరుకున పెట్టాలనుకున్న జగన్ అస్త్రం.. వైసీపీ మెడకే చుట్టుకుంటుందా?