Botsa Satyanarayana: మరోసారి కన్నీళ్లు పెట్టుకున్న బొత్స.. అమర్‌నాథ్ షాకింగ్ కామెంట్స్.. విజయనగరం రాజకీయాల్లో సంచలనం
విజయనగరం వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కన్నీటి పర్యంతం కావడం తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది.
- V Santhosh Kumar
- Published on- September 12, 2026 / 03:29 PM IST
Botsa Satyanarayana shed tears at the YSRCP meeting in Vizianagaram.
- వేదికపై బొత్స సత్యనారాయణ కన్నీళ్లు
- చిన్న శ్రీను మార్పుపై ఆవేదన
- ఐక్యంగా ఉండాలని నేతల పిలుపు
Botsa Satyanarayana: విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లా పార్టీలో మొదలైన చేరికలు, రాజీనామాలు కేడర్‌ను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఈ క్రమంలో విజయనగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు భారీగా హాజరైన ఈ వేదికపై సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతం కావడం సభలో ఉన్నవారందరినీ తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది.
చిన్న శ్రీను పార్టీ మార్పుపై తీవ్ర ఆవేదన:
బొత్స సత్యనారాయణ ప్రధాన అనుచరుడు, బంధువు అయిన చిన్న శ్రీను ఇటీవల వైఎస్సార్‌సీపీని వీడి ప్రత్యర్థి పార్టీలో చేరడంపై సమావేశంలో చర్చ జరిగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ విజయనగరం కేడర్ అంతా ‘బొత్స 2.0’ కోసం వేచి చూస్తోందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దిన బొత్స కుటుంబాన్ని ఏ శక్తులూ విడదీయలేవని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా మాట్లాడుతూ, చిన్న శ్రీను నిర్ణయం వల్ల తనపై పడుతున్న ప్రభావంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
కార్యకర్తలే పార్టీకి అసలైన బలమన్న నేతలు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం నాయకులను మాత్రమే నమ్ముకుని పెట్టలేదని, వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తల బలంతోనే నడుస్తోందని నాయకులు పునరుద్ఘాటించారు. అధికారంలో ఎవరు ఉన్నా కాలక్రమేణా పరిస్థితులు మారుతాయని, వైఎస్సార్‌సీపీ కేడర్ అంతా ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపునిచ్చారు. ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ భవిష్యత్తులో తగిన గుర్తింపు లభిస్తుందని ధైర్యం చెప్పారు.
