Students Protesting In France : ఫ్రాన్స్‌లో విద్యార్థుల తిరుగుబాటు.. స్కూళ్లలో రణరంగం.. 500కుపైగా పాఠశాలలకు నిప్పు.. వందల మందికి గాయాలు..
Students Protesting In France : ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ప్రభావంతో 500కుపైగా పాఠశాలలు మూతపడ్డాయి.
Students Protesting In France
Students Protesting In France : ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పాఠశాలల్లో వసతులను మెరుగుపరచాలని, ఉపాధ్యాయులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైస్కూల్ విద్యార్థులు నిరసనలకు దిగారు. పారిస్ ప్రాంతంలో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల వ్యవస్థ కూడా సంక్లిష్టంగా ఉందంటూ యూనివర్శిటీ విద్యార్థులు కూడా వీరితో జత కలిశారు. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కొన్నిచోట్ల విద్యార్థులు పాఠశాలలను దిగ్బంధించారు. 500కుపైగా పాఠశాలలకు నిప్పంటించారు. మరోవైపు.. ఉద్రిక్తత పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి సుమారు మూడు వేల మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్క గురువారం రోజే దాదాపు 2వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. శుక్రవారం దేశవ్యాప్తంగా సుమారు 900 నిరసనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనల ప్రభావంతో 500కుపైగా పాఠశాలలు మూతపడ్డాయి.
ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కొరతపై విద్యార్థులు ప్రధానంగా ఆందోళన బాటపట్టారు. 2024-25 విద్యా సంవత్సరంలో సెకండరీ స్థాయిలో దాదాపు 10శాతం బోధనా గంటలు నిర్వహించలేకపోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులతో తరగతి గదులు, సరిపడా సదుపాయాలు లేకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, నీటి వసతులపైకూడా వారు సమస్యలను లేవనెత్తుతున్నారు.
మరోవైపు.. ఈ ఆందోళనల్లో 170 మంది విద్యార్థులు గాయపడినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. 65 మంది పాఠశాల సిబ్బంది కూడా గాయపడినట్లు వెల్లడించారు. వారిలో 40 మంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పోలీసుల బలప్రయోగంపై హక్కుల సంస్థలు ఆరోపణలు చేయగా.. ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ అవసరమని పేర్కొంది. విద్యా వ్యవస్థలోని సమస్యలపై మొదలైన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ఫ్రాన్స్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
