తిరుమలలో మళ్లీ శ్రీవారి దర్శనాలు నిలిపివేత?

  • Publish Date - July 18, 2020 / 11:21 AM IST

తిరుమల శ్రీవారి దర్శనాలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. స్వామి వారికి కైంకర్యాలు చేసే అర్చకులకు, జీయంగార్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దర్శనాలు నిలిపివేయాలని ప్రభుత్వానికి టీటీడీ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వంతో చర్చించి దర్శనాల నిలిపివేతపై టీటీడీ తుది నిర్ణయం తీసుకోనుంది.

శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌కు కరోనా:
కరోనా వైరస్‌ మహమ్మారి తిరుమల ఆలయ అర్చకులను వణికిస్తోంది. ఇప్పటికే 15 మందికిపైగా అర్చకులు కరోనా బారినపడ్డారు. తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో టీటీడీ అధికారులు స్వామీజీని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్‌కు తరలించారు. తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని దేవస్థాన అధికారులు పరిశీలిస్తున్నారు.

సుమారు 80 రోజుల తర్వాత తిరిగి భక్తులకు దర్శన భాగ్యం:
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మార్చి 20న తిరుమల దేవస్థానాన్ని మూసివేశారు. భక్తుల దర్శనాలను నిలిపివేసి, స్వామివారి నిత్య కైంకర్యాలను కొనసాగించారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో సుమారు 80 రోజుల తర్వాత.. జూన్‌ 11న శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.

ఆలయంలో 140 మందికి కరోనా:
అయితే ఆలయంలో పని చేస్తున్న 15మంది అర్చకులు సహా 140 మందికి కరోనా సోకింది. ఇందులో టీటీడీ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, ప్రసాదాలు తయారు సిబ్బంది ఉన్నారు. మొత్తం 50 మంది అర్చకులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 15 మందికి నిర్ధారణ అయ్యింది. మరో 25 మందికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

ఏపీలో రోజూ 2వేల కరోనా కేసులు:
ఏపీలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. రోజూ 2 వేల‌కు పైగా కేసులు, 40 వరకు మరణాలు న‌మోదవుతున్నాయి. క‌రోనా కేసులు తిరుప‌తి కొండ‌నూ కుదిపేస్తున్నాయి. చూస్తుంటే, క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ మ‌రోసారి శ్రీ‌వారి ద‌ర్శ‌నాల‌పై ప‌డేలా క‌నిపిస్తోంది. తిరుమ‌ల‌లో రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో, భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నాల‌ను నిలిపివేసే ఆలోచ‌న‌లో ఉంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ).

దర్శనాలు కొనసాగిస్తే మరిన్ని కేసులు:
భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. క్యూ లైన్లలో ప్రధానంగా మార్పులు చేసింది. మార్కింగ్ చేసింది. శానిటైజర్లు అందుబాటులో ఉంచింది. భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు, గ్లౌజులు ధరించేలా సిబ్బందిని సన్నద్ధం చేసింది. భక్తుల సంఖ్యనూ బాగా తగ్గించింది. గంటకు 500మంది చొప్పున రోజుకి 6వేల 500మందికి మాత్రమే దర్శన అవకాశం కల్పించింది. అయినా కరోనా వైరస్ కట్టలు తెంచుకుంటోంది. తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు తిరిగి ప్రారంభించిన త‌ర్వాతే క‌రోనా కేసులు పెరిగాయ‌ని టీటీడీ ఉద్యోగులు, స్థానికులు చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తిరుమ‌ల‌కు వ‌చ్చిన భ‌క్తులు ఎవ్వ‌రూ క‌రోనాబారిన ప‌డ‌క‌పోయినా.. పూజారుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు అనేక‌మంది క‌రోనా బాధితులుగా మారిపోయారు. మెరుగైన వైద్యం కోసం అర్చకులను చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ద‌ర్శ‌నాలు ఇలానే కొన‌సాగిస్తే మ‌రిన్ని కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని టీటీడీ భావిస్తోంది. దీంతో.. తాత్కాలికంగా ద‌ర్శ‌నాలు నిలిపివేసే యోచన చేస్తోంది. భక్తులకు దర్శనాలు నిలిపివేసినా, శ్రీ‌వారికి పూజా కైంక‌ర్యాలు మాత్రం యథావిథిగా నిర్వహించనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక, దర్శనాల రద్దుపై టీటీడీ అధికారిక ప్రకటన చేయనుంది.