Buddha Venkanna
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి వినిపించలేదా అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ తాటాకు చప్పుళ్లకు విజయసాయిరెడ్డి మురిసిపోయారని చెప్పారు.
దాడులు చేయవద్దని తమ నాయకులు ముందే చెప్పారని అన్నారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయి రెడ్డి దానిపై రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. గత ఐదేళ్లల్లో విజయసాయిరెడ్డి, జగన్ వైసీపీ నేతల నోళ్లను ఎందుకు అదుపు చేయలేదని నిలదీశారు.
ఇప్పుడు ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రను దోచేశరని చెప్పారు. వీటిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. తాము దాడులు చేయాలని అనుకుంటే పరిస్థితి ఇలా ఉంటుందా అని నిలదీశారు.
కక్ష సాధింపు రాజకీయాలు వద్దని చంద్రబాబు నాయుడు ప్రకటించారని అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగిందని, దాన్ని డైవర్ట్ చేయడానికే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని తెలిపారు.
అధికార మదంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్లను వైసీపీ నేతలు తిట్టించారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు తాము ధైర్యంగా పోరాడి నిలబడ్డామని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చిందని, కానీ ఇప్పుడు జగన్‌కు అదీలేదని అన్నారు.
Also Read: ఆనాడు అక్కడ నన్ను ఆయనే రక్షించాడు: చంద్రబాబు నాయుడు