Bullet Train
Bullet Train : ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభవార్త.. చెన్నై- హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దక్షిణ భారతదేశంలో ప్రయాణించే విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇకపై ఈ మార్గంలో 12గంటల రాత్రి ప్రయాణం ఉండదు.. కేవలం రెండు గంటల్లో ప్రయాణం పూర్తవుతుంది. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
హైదరాబాద్ – చెన్నై కారిడార్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలో చేర్చేందుకు తుది అలైన్మెంట్ సమర్పించింది. హైస్పీడ్ మార్గం కారిడార్‌కు సమగ్ర ప్రాజెక్టు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నెలలోపు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) పూర్తి చేస్తామని చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (సీయూఎంటీఏ) తెలిపింది.
హైదరాబాద్ – చెన్నై మధ్య ప్రయాణం ప్రస్తుతం 12 గంటల సమయం పడుతుంది. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా కొత్తగా డిజైన్ చేసిన మార్గంతో ప్రయాణ సమయం 2.20గంటలకు తగ్గనుంది. రాష్ట్రంలోని హైస్పీడ్ నెట్‌వర్క్ నిర్మాణంలో 12 కిలో మీటర్లు వరకు సొరంగ మార్గం ఉండనుంది. స్థల సేకరణపై జాప్యాన్ని నివారించేందుకు రైల్వేశాఖలు రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి.
దక్షిణాదిన ప్రణాళికలో ఉన్న రెండు హైస్పీడ్ మార్గాల్లో ఒకటి చెన్నై – హైదరాబాద్, రెండోది హైదరాబాద్ – బెంగళూరు కారిడార్. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను కలిపేలా సర్వే జరుగుతోందని ఇటీవల విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
హైదరాబాద్ – చెన్నై కారిడార్‌లో భాగంగా తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థన మేరకు గతంలో గూడూరు మీదుగా ప్రణాళిక రూపొందించిన స్థానంలో తిరుపతిలో స్టేషన్‌ను చేర్చడానికి మార్పులు చేశామని సీయూఎంటీఏ కార్యదర్శి జయకుమార్ తెలిపారు.
చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ తమిళనాడు గుండా వెళ్లే మార్గం 61 కిలోమీటర్లు. ఈ విభాగంలో 11.6 కిలోమీటర్ల పొడవైన ప్రధాన సొరంగం ఉంటుంది. ఈ రైలు మార్గం తమిళనాడులోని కీలక స్టేషన్లను కలుపుతుంది. వీటిలో ఐకానిక్ చెన్నై సెంట్రల్ చెన్నై రింగ్ రోడ్డు వెంబడి సౌకర్యవంతంగా ఉన్న మింజార్ సమీపంలో కొత్తగా ప్రతిపాదించిన స్టేషన్ ఉన్నాయి.
హైస్పీడ్ ప్రయాణాన్ని సులభతరం చేయడంతోపాటు రైల్వే ప్రతి స్టేషన్ చుట్టూ వాణిజ్య ప్రాంతాలు సమగ్ర మొబిలిటీ జోన్లను కూడా ప్లాన్ చేసింది. ఇవి పట్టణ అభివృద్ధిని పెంపొందిస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తాయి. ప్రాజెక్టు సకాలంలో అమలు అయ్యేలా చూసుకోవడానికి భూసేకరణ నిబంధనలు స్టేషన్ స్థానాలను ఖరారు చేయాలని దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.
హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ ప్రతిపాదిత మార్గానికి 223.44 హెక్టార్ల భూమి అవసరం. అటవీ భూమి ఇందులో లేదని రైల్వే అధికారులు గుర్తించారు. ఆ మార్గం 65 రోడ్లు, 21 హైటెన్షన్ విద్యుత్తు లైన్లు దాటనుంది.