Visakha Municipal Corporation : మలేషియాకు కార్పొరేటర్లు..!- విశాఖలో ఉత్కంఠ రేపుతున్న క్యాంప్ రాజకీయాలు

మరోవైపు ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేశారు.

Visakha Municipal Corporation : విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కూటమి కార్పొరేటర్లు, నేతలు విదేశాలకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. తమ కార్పొరేటర్లను మలేషియాకు తరలించేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేశారు.

విశాఖలో క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. మేయర్ హరి వెంకట కుమారి మీద కూటమి కార్పొరేటర్లు కలెక్టర్ కు అవిశ్వాస నోటీసులు అందజేశారు. కూటమికి బలం ఉందని చెప్పుకుంటున్నారు. బల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

Also Read : వైసీపీని వీడుతున్న వారిలో వీరే ఎక్కువ.. తోట త్రిమూర్తులు కూడా రెడీ!

ఈ నేపథ్యంలో సర్దుబాటు కోసం ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కూటమి, విపక్ష వైసీపీ క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే వైసీపీ తమ పార్టీకి సంబంధించిన 29 మంది కార్పొరేటర్లతో బెంగళూరులో గత రెండు మూడు రోజులుగా క్యాంప్ నడుపుతోంది.

తాజాగా కూటమి పార్టీల నేతలు కూడా తమ కార్పొరేటర్లు అందరితో మరో క్యాంపు ఏర్పాటు చేయడానికి అధికార కూటమి పక్షం నిర్ణయానికి వచ్చింది. వారందరిని ఏకంగా విదేశాలకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. మలేషియా లేదా మరో ఏదైనా దేశానికి కూటమి పక్షానికి మద్దతు తెలుపుతున్న కార్పొరేటర్లందరిని తరలించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ మేరకు ఆయా కార్పొరేటర్ల నుంచి పాస్ పోర్టులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మహిళా కార్పొరేటర్లు తమ భర్తలను వెంట తీసుకుని వెళ్లనున్నారని సమాచారం. కలెక్టర్ ఎప్పుడు ముహూర్తం నిర్ణయిస్తే అప్పుడు బల ప్రదర్శన ఉంటుంది. దీంతో అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి.