మూడు రాజధానులపై GN RAO కమిటి నివేదిక తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు జగన్ సర్కార్ నిర్ణయంపై న్యాయపోరాటం సిద్ధమవుతున్నారు టీడీపీ నేతలు. ఇక సీఎం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు.
మరోవైపు తాము అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్నారు వామపక్ష నేతలు. దీంతో ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు టీడీపీ నేత దేవినేని ఉమా. అందుకే విశాఖ రాజధాని అంటూ కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. జీఎన్ రావు కమిటీ అంటే జగన్ కమిటీ అని, జగన్ ఏం చెబితే అదే కమిటీ చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో గత 6 నెలలుగా 6 వేల ఎకరాల భుములను విజయసాయి రెడ్డి అండ్ కో కొనుగొలు చేశారని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే చుస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు దేవినేని ఉమా. రాజధాని మార్పునకు మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఒక కారణమన్నారు సీపీఐ నేత నారాయణ. వామపక్ష నేతలుగా తాము ఎప్పటినుంచో విజయవాడ బేస్డ్‌గా రాజధాని కావాలని చెబుతున్నామన్నారు.
ప్రాంతాల అభివృద్ధి అక్కడ లభించే వనరులను బట్టి వుంటుందేగాని.. రాజధాని వలన కాదన్నారు. సీడ్ కేపిటల్ లేకుంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు నారాయణ. మొత్తానికి రాజధాని చిచ్చు ఏపీ పొలిటికల్ వింగ్‌లో రచ్చ చేస్తోంది. అధికార, విపక్షాల మధ్య డైలాగ్‌వార్‌కు తెరలేపింది.
Read More : పరిపాలన రాజధానిగా భీమిలి ఎందుకు