కేపిటల్ పొలిటిక్స్ : రాజధాని రైతులకు అన్యాయం జరగదు – వైసీపీ ఎంపీ

  • Publish Date - December 24, 2019 / 08:20 AM IST

రాజధాని రైతులకు అన్యాయం జరగదని, తమకు న్యాయం జరగాలని వారు ఆందోళన చేయడం సబబేనని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. రాజధాని తరలింపుపై అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో… ఈ అంశంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.

అమరావతితోపాటు విశాఖలో కూడా రాజధాని ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు..

మంత్రుల నివాసాలు కూడా ఇక్కడే ఉంటాయని సీఎం జగన్ చెప్పారనే విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదని, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదంతోపాటు అసెంబ్లీ తీర్మానం అవసరమన్నారు. అమరావతికి కేబినెట్‌ ఆమోదంతోపాటు అసెంబ్లీ తీర్మానం ఉన్నందున  ఆ ప్రాంత రైతులకు అన్యాయం జరగదని భావిస్తున్నానన్నారు రఘురామకృష్ణంరాజు. 

 

మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన, GN RAO కమిటీ నివేదికపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. గత ఏడు రోజులుగా ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవలే పార్లమెంట్‌లో ఈయన చేసిన ప్రసంగం దుమారాన్ని సృష్టించింది. తెలుగు భాషపై ఆయన మాట్లాడారు.

 

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీఎం జగన్ కూడా సీరియస్ అయ్యినట్లు ప్రచారం జరిగింది. అనంతరం సీఎం జగన్‌ను కలిసి ఆయన వివరణ ఇచ్చారు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసిన కామెంట్స్‌తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.