Adapa Seshu: కాపులను మోసం చేయడానికే పవన్ వారాహి యాత్ర.. అంతా కలిసి కుట్ర చేస్తున్నారు
వారాహి యాత్ర రూపంలో రేపటి నుంచి మరో మోసం జరగబోతోంది. కాపులను మోసం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నాడు.
- Harishth Thanniru
- Published On : June 13, 2023 / 02:24 PM IST
Adapa Seshu
Kapu Corporation Chairman: ”వారాహి యాత్ర రూపంలో రేపటి నుంచి మరో మోసం జరగబోతోంది. కాపులను మోసం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన రూట్లోనే ఆయన యాత్ర సాగుతుంది. కాపులు ఇప్పటికైనా కళ్లు తెరవడి” అంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
చంద్రబాబు హయాంలో కాపులపై జరిగిన దుర్మార్గాలను పవన్ ఏనాడైనా ప్రశ్నించారా? జనసేన చంద్రబాబు పెట్టించిన పార్టీ అని మాకిప్పటికీ అనుమానంగా ఉందని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన రూట్లోనే వారాహి యాత్ర సాగుతుంది. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే పవన్ కళ్యాణ్ చదువుతారు. ముఖ్యంగా.. కాపులున్న ఏరియాలోనే పవన్‌తో చంద్రబాబు యాత్ర చేయిస్తున్నాడని ఆరోపించారు. అంతాకలిసి వారాహి యాత్ర రూపంలో రేపట్నుంచి కాపులను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని అడపా శేషు విమర్శించారు.
Pawan kalyan : ఎన్నికలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమంపై కేసులు పెడితే ఎందుకు మాట్లాడలేదో పవన్ చెప్పాలని అడపా శేషు డిమాండ్ చేశారు. కాపులకు క్షమాపణలు చెప్పి, సమాధానం చెప్పిన తరువాతే పవన్ వారాహి యాత్రను ప్రారంభించాలని అన్నారు. కాపు ఓట్లు చంద్రబాబు దరిచేర్చడానికే పవన్ పనిచేస్తున్నాడని, కాపులంతా ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు. 2014లో మిమ్మల్నిచూసి టీడీపీకి ఓట్లేస్తే ప్రజలకు మీరేం చేశారని ప్రశ్నించారు. లోకేష్ ఒక్కడికే మంత్రి ఉద్యోగం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. లోకేష్ పెద్ద నాయకుడిలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లోకేష్ స్థాయి పెద్దిరెడ్డి రాజకీయ అనుభవమంతలేదు, ఆ విషయాన్ని లోకేష్ తెలుసుకోవాలని అడపా శేషు సూచించారు.
పవన్ అసలు మీ ఆలోచన ఏంటి? కాపులకు ఏం చేస్తారో చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు, లోకేష్, పవన్ వల్ల ఎంత మంది కాపులకు మేలు జరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ నీతీరు మార్చుకో.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపు పేద కుటుంబాలకు ఎంతమందికి సంక్షేమం అందుతుందో తెలుసుకో, కాపులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి అని అడపా శేషు కోరారు. పార్టీలతో సంబంధం లేకుండా జగన్ కాపులకు సాయం అందిస్తున్నారు. ”దయచేసి కుల, ప్రాంత, మత రాజకీయాలు చేయొద్దని చేతులెత్తి మొక్కుతున్నా. అలాచేసి కాపులను మోసం చేయొద్దు పవన్” అంటూ కోరారు.
