జనసేన ఫిర్యాదులతో దువ్వాడపై కేసులు నమోదు.. హైదరాబాద్‌లో మకాం పెట్టినా ఆయనపైనే ఫోకస్ ఎందుకు?

కూటమి ప్రభుత్వం వచ్చాక యాక్షన్ స్టార్ట్ చేశారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడిన ఫ్యాన్‌ పార్టీ నేతలకు ఇప్పుడు బ్యాడ్ టైమ్‌ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వరుస పెట్టి ఒకరి తర్వాత మరొకర్ని అరెస్ట్ చేస్తుండటంతో నెక్స్ట్ ఎవరి వంతు వస్తుందోనని వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుందట. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళీ అరెస్ట్ అయ్యారు.

బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వంతు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కుటుంబ గొడవల్లో రచ్చకెక్కిన దువ్వాడ హైదరాబాద్‌కు మకాం మార్చారు. మాధురితో కలిసి హైదరాబాద్‌లో స్యారీస్‌ బిజినెస్‌ కూడా చేస్తున్నారు. కొన్నాళ్లుగా టెక్కలికి దూరంగా ఉంటున్నారు. అయినా లోకల్‌గా ఆయనపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే పోసాని తర్వాత నెక్స్ట్‌ టార్గెట్ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసేనని టాక్ వినిపిస్తుంది. జనసేన నేతలు వరుస పెట్టి ఫిర్యాదులు చేయడం.. పోలీసులు దువ్వాడపై కేసులు పెట్టడంతో దువ్వాడకు దరువు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నోటికొచ్చిన మాటలతో తిట్టారని జనసేన నేత గండి హారిక అమలాపురం పోలీసులకు కంప్లైంట్ చేశారు. తమ అభిమాన నేతను దారుణమైన పదజాలంతో దూషించి తమను మానసికంగా మనోవేదనకు గురిచేశారని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై యాక్షన్‌ తీసుకోవాలని కోరారు.

అక్కడ కూడా కేసు
అమలాపురం పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు. ఇక అమలాపురం నియోజకవర్గ పరిధిలోనే ఉప్పలగుప్తం పోలీస్‌స్టేషన్‌లో కూడా దువ్వాడ శ్రీనివాస్‌పై మరో కేసు నమోదైంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకి జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేయగా అక్కడ కూడా పోలీసులు కేసు పెట్టారు. మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ పీఎస్‌లల్లో కూడా జనసేన నేతలు దువ్వాడపై ఫిర్యాదులు చేశారు.

గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలోనే జనసేన నేత కణితి కిరణ్‌కుమార్ టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దువ్వాడను విచారణ కూడా చేశారు. ఇలా రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లలో జనసైనికులు దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదులు చేయడం..పోలీసులు కేసులు పెట్టడంతో నెక్స్ట్ టార్గెట్ ఆయనేనన్న చర్చ జరుగుతోంది.

ఇటీవల జనసేన పార్టీకి చెందిన ముఖ్యనేత రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ ఓ సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను దారుణంగా దూషించిన ఓ వ్యక్తి జైలుపాలయ్యారని, ఎమ్మెల్సీ అయ్యుండి కూడా దారుణంగా మాట్లాడిన దువ్వాడ పరిస్థితి ఏమవుతుందో..అంటూ చేసిన వ్యాఖ్యలను వారంతా గుర్తు చేస్తున్నారు.

వరుసగా ఫిర్యాదులు
నాదెండ్ల మనోహర్ ఆ కామెంట్స్ చేశాకే దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు, వీరమహిళలు వరుసగా ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇదంతా చూస్తుంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అరెస్ట్ కూడా ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అటు చంద్రబాబు ఇటు జనసేనాని పవన్ కల్యాణ్‌పై కొందరు వైసీపీ నేతలు ఒంటికాళ్ళతో లేస్తూ తీవ్రంగా విరుచుకుపడే వారు. లోకేశ్‌ను కూడా ఎడాపెడా విమర్శించేవారు. అప్పట్లో వారి మాటలు టీడీపీ, జనసేన..లీడర్లు, క్యాడర్‌ను తీవ్రంగా కలిచివేశాయి. అడ్డగోలుగా బిహేవ్‌ చేస్తున్నవారి వివరాలను రెడ్‌బుక్‌లో నమోదు చేసినట్లు ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు లోకేశ్.

కూటమి ప్రభుత్వం వచ్చాక యాక్షన్ స్టార్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అంటున్నా ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతుంది. ఈ చర్యలతో ఎప్పుడు ఎవరికి మూడుతుందోనన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న నేతల లిస్ట్‌లో దువ్వాడ అరెస్టుల ఉంటుందన్న ప్రచారం బలంగా జరుగుతోంది. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదెవరో చూడాలి మరి.