Visakha Steel Plant : కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనతో అక్కడున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాము భావిస్తున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చూసుకోవాలన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తికి చేశారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పని చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్-కార్డ్ ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వైజాగ్ వచ్చిన కుమారస్వామికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ గెస్ట్ హౌస్ కు వెళ్లారు కుమార స్వామి. స్టీల్ ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై ఆయన సమీక్ష చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు. అధికారులతో కుమారస్వామి, ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ సమీక్ష చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కుమంత్రి స్టీల్ ప్లాంట్ కు వచ్చారు. దీంతో స్టీల్ ప్లాంట్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంతా భావిస్తున్నారు. విశాఖ ఉక్కుపై అందరిలోనూ ఆశలు చిగురిస్తున్నాయి.
Also Read : ఓవైపు కేసులు, మరోవైపు తిరుగుబాట్లు..! పీకల్లోతు కష్టాల్లో కొడాలి నాని