TTD (Photo : Google)
TTD : టీటీడీకి (తిరుమల తిరుపతి దేవస్థానం) కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపునిచ్చింది.
భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కొనాలని కేంద్రం కోరింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఇలాంటి మినహాయింపు ఇస్తున్నట్లు టీటీడీకి సమాచారం ఇచ్చారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్.
గతంలో ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల వ్యవహారంలో టీటీడీకి రూ.3కోట్ల జరిమానా విధించింది కేంద్రం. జరిమానా చెల్లించిన అనంతరం ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసుకునేందుకు లైసెన్స్ రెన్యువల్ చేసింది కేంద్రం. లైసెన్స్ రెన్యువల్ చేసినా.. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసే సమయంలో దాతల వివరాలు తెలపాలన్న నిబంధనను మాత్రం కేంద్రం సడలించలేదు. తాజాగా టీటీడీ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.