CM Chandrababu Naidu
అమరావతిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయుల్లోని పార్టీ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డా సరే తాము వెనక్కు తగ్గబోమని అన్నారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఎవరు ఎంత అడ్డు పడినా రాష్ట్ర పునర్ నిర్మాణ యజ్ఞం ఆగదని చెప్పారు.
“ఈ నెల 12 లేదా 14వ తేదీలోపే తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తాం. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చాం. తద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి” అని అన్నారు.
“తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టునూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించలేదు. పోలవరం బనకచర్ల అనుసంధానం పై కొందరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ప్రపంచ యోగా డే నిర్వహణలో పార్టీ శ్రేణులు భాగస్వాములై విజయవంతం చేయాలి” అని చంద్రబాబు చెప్పారు.
ఏడాది పాలనపై 12వ తేదీన నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపట్టాలని చెప్పారు. అదే రోజు సాయంత్రం ఎన్డీయే పక్షాలు, అధికార యంత్రాంగంతో వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై అమరావతిలో సమీక్షా సమావేశం ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించామని, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
ప్రభుత్వ పనితీరు, పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నానని, ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటానని స్పష్టం చేశారు.
Also Read: 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకున్న యువతి… ఎందుకని అడిగితే షాకింగ్ రీజన్..
మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని ఎవరైనా ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోతే వారికే ఎక్కువ నష్టం జరుగుతుందని హెచ్చరించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదని అన్నారు.
అధికారంలో ఉన్న మనల్ని ప్రజలు అన్ని రకాలుగా గమనిస్తుంటారని, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. గత ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలుముకుందని అన్నారు. భయంకర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు చూశారని, రాష్ట్రం పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారని చెప్పారు.
ఆర్థికంగా రాష్ట్రాన్ని అసమర్థ పాలనతో పాతాళానికి తొక్కేశారని తెలిపారు. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనకు ఓట్లువేసి గెలిపించారని అన్నారు. శాశ్వతంగా ప్రజలు మనతో ఉండేలా చూసుకుంటూ మరింత నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు.
కొన్ని సందర్భాల్లో అడ్మినిష్ట్రేషన్ లో తప్పుల వల్ల, అధికారుల తీరు వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని తెలిపారు. మంత్రులు ఈ విషయంలో మరింత బాధ్యతగా ఉండాలని అన్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని చెప్పారు.
త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తానని అన్నారు.