Andhra Politics: త్రిశూల వ్యూహంతో కాకపుట్టిస్తున్న చంద్రబాబు, పవన్, లోకేశ్!

ఈ ముగ్గురు పర్యటనలు చూస్తే ఎవరి పని వారిదే అన్నట్లు కనిపిస్తోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే అనిపిస్తోంది. కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ముగ్గురు నేతల పర్యటనలకు ఏదో లింక్ ఉంటోంది.

chandrababu, lokesh, pawan kalyan

Andhra Pradesh Politics: త్రిశూల వ్యూహం (Trident strategy) రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma) సినిమా వ్యూహానికి కౌంటర్‌గా ఇంకేదైనా సినిమా వస్తుందని అనుకుంటున్నారా..? కానీ, ఈ త్రిశూల వ్యూహం సినిమా కాదు.. సినిమాను మించిన పొలిటికల్ డ్రామా (Political Drama). అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వేసిన పక్కా స్కెచ్చే.. ఈ త్రిశూల వ్యూహం.. చంద్రబాబు, పవన్, లోకేశ్.. ఈ ముగ్గురే త్రిశూల వ్యూహంలో కథా నాయకులు.. సీఎం జగన్ (CM Jagan) టార్గెట్‌గా జనంలో తిరుగుతున్న ముగ్గురు కీలక నేతల ప్లానింగ్ ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్ (Hot Topic) అవుతోంది. కాకతాళీయమో లేక అలా షెడ్యూల్ కుదురుతుందో గాని.. ముగ్గురు నేతల పర్యటనలు త్రిశూల వ్యూహాన్ని గుర్తు చేస్తోంది. ఏంటీ త్రిశూల వ్యూహాం.. ఎలా అమలు చేస్తున్నారు?

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ జోరు పెంచారు. వరుస పర్యటనలతో కాకపుట్టిస్తున్నారు. ఈ ఇద్దరే కాకుండా టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో జనం మధ్యే గడుపుతున్నారు. ఈ ముగ్గురు పర్యటనలు చూస్తే ఎవరి పని వారిదే అన్నట్లు కనిపిస్తోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే అనిపిస్తోంది. కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ముగ్గురు నేతల పర్యటనలకు ఏదో లింక్ ఉంటోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లు కాకుండా.. ఒకరి వెంట ఇంకొకరు అన్నట్లు ముగ్గురు నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. సీఎం జగన్ టార్గెట్‌గా జరుగుతున్న ఈ పర్యటనల్లో ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఎన్నికల వరకు కొనసాగించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సీఎం జగన్ పలుకుబడిని పలుచన చేయాలంటే.. తాము జనం మధ్యే ఉండాలని అనుకున్న ఈ ముగ్గురు నేతలు గత జనవరి నుంచి జనం మధ్యే తిరుగుతూ నిత్యం ఏదో ఒక టాపిక్‌ను లేవనెత్తుతూ అధికార పార్టీని డిఫెన్స్‌లో పడేస్తున్నారు.

Pawan, CBN, Lokesh

టీడీపీ, జనసేన మధ్య ఎలాంటి పొత్తు లేదు.. ఉన్నదంతా కేవలం అవగాహనే.. స్నేహపూర్వక సంబంధమే.. పొత్తు పొడవకముందే రెండు పార్టీల్లోని ముగ్గురు నాయకులు ఉమ్మడిగా ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడి చేస్తున్నారు. యువగళం పాదయాత్రతో లోకేశ్.. వారాహియాత్రతో పవన్ ఓ షెడ్యూల్ పెట్టుకుని తిరుగుతుంటే.. ఈ ఇద్దరి పర్యటనలను సమన్వయం చేస్తున్నట్లు వారి పర్యటనలకు వెనకో.. ముందో చంద్రబాబు జిల్లాల్లో తిరుగుతున్నారు. మరో ఏడెనిమిది నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కానీ రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం ఆర్నెల్ల కిందటే రాజుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో విశాఖలో పవన్ యాత్రను అడ్డుకోవడం.. డిసెంబర్‌లో కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు సృష్టించడంతో.. ప్రభుత్వంపై ఉమ్మడిగా దండయాత్ర ప్రకటించారు రెండు పార్టీల అధినేతలు. జనవరి 8న విజయవాడలో చంద్రబాబు, పవన్ భేటీ తర్వాత కలిసిపోటీ చేసే చాన్స్ ఉందని ప్రకటించారు.. ఆ తర్వాత ఈ దిశగా రెండు పార్టీల్లోనూ ఎలాంటి కదలిక కనిపించకపోయినా.. అంతర్గతంగా ఓ అవగాహనతోనే కదలుతున్నారు.

Also Read: బెజవాడ బ్యాచ్‌పై చంద్రబాబు అసంతృప్తి.. యువగళం పాదయాత్ర కుదింపు.. రగిలిపోతోన్న లోకేశ్!

చంద్రబాబు, పవన్ భేటీ తర్వాత టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర జనవరి 27న చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. ఆ తర్వాత రాయలసీమ నాలుగు జిల్లాల్లో 44 నియోజకవర్గాల మీదుగా సుమారు 15 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు లోకేశ్. ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే దాదాపు 124 రోజులు అంటే నాలుగు నెలలు కొనసాగిన ఈ పర్యటన ప్రజల్లో చర్చనీయాంశమైంది. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను మించి రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర చేశారు లోకేశ్. జగన్ 9 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తే లోకేశ్ 15 వందల కిలోమీటర్లు తిరిగారు. ఇలా ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసిన లోకేశ్ పాదయాత్ర జూన్‌లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టింది. నెల్లూరు, ప్రకాశం మీదుగా పల్నాడు ప్రాంతంలోకి లోకేశ్ రావడంతోనే చంద్రబాబు తెరపైకి వచ్చారు. లోకేశ్ కోస్తాలో ఉండటంతో రాయలసీమలో వేడి చల్లబడకుండా కర్నూలు నుంచి ప్రాజెక్టు యాత్ర చేపట్టారు చంద్రబాబు.. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు యాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అంగళ్లు, పుంగనూరు సంఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక్కడ తప్పు ఎవరిదైనా.. చంద్రబాబు లక్ష్యం మాత్రం నెరవేరింది. ప్రభుత్వంపై పోరాటంలో వెనక్కి తగ్గేదేలే అన్న వ్యూహామే ప్రముఖంగా కనిపిస్తోంది.

Also Read: గల్లా కుటుంబం తరుఫున ఎవరుపోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

ఇలా రాయలసీమలో లోకేశ్, బాబు పర్యటనలు కొనసాగితే.. పవన్ వారాహి యాత్రతో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలను చుట్టేసే కార్యక్రమం మరోవైపు మొదలైంది. ఇప్పటికే రెండు విడతల యాత్ర పూర్తి చేసి మూడో విడత యాత్ర చేస్తున్నారు పవన్.. ఐతే పవన్ యాత్రకు ముందు వెనుక గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలో పర్యటించి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు చంద్రబాబు. పవన్ వారాహి యాత్ర జూన్ 14న కత్తిపూడిలో ప్రారంభమైతే.. అప్పటికి నెల రోజుల ముందు గోదావరి జిల్లాల్లో విస్తృత పర్యటన చేశారు చంద్రబాబు. జూన్, జులై నెలల్లో పవన్ గోదావరి జిల్లా పర్యటనలు ముగిశాక… మళ్లీ తాజాగా అదే ప్రాంతంలో పర్యటన పెట్టుకున్నారు చంద్రబాబు.. వారాహి యాత్రలో సంచలన ప్రకటనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా కాకరేపారు పవన్.. ఆ వేడి తగ్గిపోతుందనగా చంద్రబాబు తెరపైకి వచ్చి అదే జోరు కొనసాగేలా చేస్తున్నారు. చివరకు ఒక్కరోజు విరామం కూడా తీసుకోవడం లేదు. ఆగస్టు 15 వేడుకలకు విశాఖ నుంచి పవన్ అమరావతి వస్తే.. అదేరోజు బాబు విశాఖ వెళ్లి పవన్ లేనిలోటు కనిపించకుండా చేశారు.

Also Read: జనసేనతో పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి తన సీటు త్యాగం చేస్తారా?

ఇలా బాబు.. పవన్.. లోకేశ్.. ఒకరికొకరు సంబంధం లేనట్లే తిరుగుతున్నా.. ఒకరి తర్వాత ఒకరుగా ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడమే వైసీపీ పనిగా మారిపోయింది. సీఎం జగన్ జిల్లాల పర్యటనల్లో బాబు, పవన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. అవి ఒక్కరోజు ముచ్చటగానే తెరమరుగవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేతలు ముగ్గురు నిత్యం జనం మధ్యే ఉంటుండటంతో మంచి మైలేజ్ కొట్టేస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో కాని.. ముగ్గురు మూడు వైపుల నుంచి ప్రభుత్వంపై దాడి చేయడం మాత్రం త్రిశూల వ్యూహాన్ని తలపిస్తోందనేదే క్లియర్‌కట్ హాట్‌టాపిక్.

ట్రెండింగ్ వార్తలు