×
Ad

Chandrababu Naidu: పదవులు.. పంపకాలు.. చంద్రబాబుకు సవాల్‌..!?

సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్‌కు వస్తున్న చంద్రబాబు..పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

Chandrababu Naidu

Chandrababu Naidu: ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. పవర్‌లోకి వచ్చాం సరే.. పదవుల మాటేమిటని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు దక్కని వారు..పార్టీ పదవులపై నమ్మకం పెట్టుకున్నారు. ఇంకొందరు మిలిగిలిపోయిన నామినేటెడ్‌ పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు.

అసలే అధికార పార్టీ. పైగా గత ఎన్నికలకు ముందు వైసీపీతో సహా వివిధ పార్టీల నుంచి వచ్చి టీడీపీలో చేరిన లీడర్ల సంఖ్య పెద్దగానే ఉంది. దీంతో కూటమిలో భాగంగా..జనసేన, బీజేపీకి పదవులు షేర్ చేయడంతో పాటు..టీడీపీలో పాత, కొత్త నేతలకు పదవులు కట్టబెట్టడం తెలుగుదేశం పార్టీ హైకమాండ్‌కు సవాల్‌గా మారిందట. పార్టీ కమిటీల నియామకంలో అయితే సీఎం చంద్రబాబు కూడా ఒత్తిళ్లు ఫేస్ చేయాల్సి వస్తోందట.

ఓ వైపు సీనియర్లు..ఇంకోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్, మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డోళ్లు, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలు..ఇలా అందరికి పదవులు అకామిడేట్ చేయడం కోసం తీవ్ర కసరత్తే చేస్తున్నారట. పదవుల పంపకం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ఈ వడపోతను కొలిక్కి తేలేక..అధినేత మీదే భారం వేసిందట. ఈ క్రమంలోనే త్రిసభ్య కమిటీపై చంద్రబాబు సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మూడు నెలల టైమ్‌లో ఒక అడుగు కూడా ముందు పడకపోతే ఏం చేస్తున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో రూ.9 కోట్లు పెడితే గ్రీన్ కార్డు వచ్చేస్తుందా?

జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కమిటీల నియామకంపై పార్టీ ముఖ్యనేతలతో డిస్కస్ చేశారు చంద్రబాబు. 32 మంది సభ్యులున్న పార్లమెంట్ కమిటీని 40మందికి పెంచాలని డిసైడ్ చేశారు. మహిళలతో పాటు, ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పిస్తూ పార్లమెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారట.

సోషల్ ఇంజినీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా జిల్లా కమిటీలు ఉండాలనేది బాబు సూచన అంటున్నారు. అయితే పార్టీ పదవులు, ప్రభుత్వ పరంగా పెండింగ్‌లో ఉండిపోయిన గ్రంథాలయ కమిటీల విషయంలో కొంత కదలిక వచ్చింది. 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్లను ప్రకటించారు. ఇందులో 10 టీడీపీ, రెండు జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించారు. అయితే ఆరు నెలల క్రితమే టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదంటున్నారు.

ఏకగ్రీవంగా కమిటీల ఎంపిక ఈజీ అవ్వట్లేదా?
జిల్లా అధ్యక్ష పదవులతో పాటు కార్యవర్గంలో చోటు కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉందని, దీంతో ఏకగ్రీవంగా కమిటీలను ఎంపిక చేయడం అంత ఈజీ అవ్వట్లేదట. పార్టీ జిల్లా కమిటీల ఎంపిక చేయాలని కొందరు ముఖ్యనేతలకు చంద్రబాబు బాధ్యత అప్పగించగా..నేతల మధ్య పోటీతో సీనియర్లు చేతులెత్తేస్తున్నారట.

ఆగస్ట్‌ నుంచి జిల్లా కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన వర్కౌట్ అవ్వట్లేదట. ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌కు పార్లమెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని త్రిసభ్య కమిటీకి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే పలు జిల్లాల్లో తీవ్ర పోటీ ఉండటంతో ఎంపిక ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయిందట. పార్టీ అధికారంలో ఉండటం, స్థానిక ఎన్నికల రానుండటంతో పాటు..భవిష్యత్‌ రాజకీయ అంచనాల నేపథ్యంలో జిల్లా కమిటీలపై నేతలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

ప్రభుత్వ పరమైన పదవులు లేకపోయినా, పార్టీ పదవులు ఉంటే తమ ప్రాంతంలో విలువ ఉంటుందనే భావనతో ఎక్కువ మంది నేతలు జిల్లా అధ్యక్ష పదవులను ఆశిస్తున్నారట. దీంతో సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్‌కు వస్తున్న చంద్రబాబు..పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. మరి పదవుల పంపకాన్ని ఎలా పూర్తి చేస్తారో..అసంతృప్తులకు ఎలాంటి హామీలు ఇస్తారో వేచి చూడాలి మరి.