ఐదు గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి విశాఖ ఎయిర్ పోర్టులోనికి పోలీసులు తరలిస్తున్నారు. లాబీలో కూర్చొని బాబు నిరసన తెలియచేస్తారా ? లేక ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళుతారా ? అనేది తెలియాల్సి ఉంది. అక్కడనే ఏర్పాటు చేసిన ఓ వాహనంలో బాబును ఎయిర్ పోర్టులోనికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అక్కడనే ఉన్న వైసీపీ శ్రేణులు..బై బై..బాబు, గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ..సంబరాలు జరుపుకుంటున్నారు.
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం పర్యటించేందుకు బాబు యత్నించారు. దీనిని అడ్డుకుంటామని ముందునుంచే వైసీపీ చెబుతూ వస్తోంది. గురువారం ఎయిరో పోర్టులో దిగినప్పటి నుంచి బాబుకు నిరసన సెగ తగిలింది. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు మోహరించి..బాబు కాన్వాయ్‌కి అడ్డు తగిలారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా..టీడీపీ శ్రేణులు పోటీగా నినాదాలు చేశారు.
దీంతో ఎయిర్ పోర్టు రణరంగ పరిస్థితిని తలపించింది. బాబు బయటకు వెళ్లకుండా..పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఎయిర్ పోర్టు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీనీకి బాబు నో చెప్పారు. చివరకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా..తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సెక్షన్ కింద అరెస్టు చేస్తున్నారో తెలుపాలని బాబు ప్రశ్నించారు.
చివరకు బాబుకు ఓ లెటర్ అందించారు. మాజీ ముఖ్యమంత్రి కావడం..మీ యొక్క భద్రత దృష్ట్యా, రక్షణ నిమిత్తం CRPC 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్టు చేస్తు..ఈ నోటీసు ద్వారా తెలియచేస్తున్నాం…సహకరించాలని కోరుతున్నామని అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ (వెస్ట్ సబ్ డివిజన్) విశాఖ సిటీ తెలిపారు. అనంతరం ఓ వాహనంలో విశాఖ ఎయిర్ పోర్టులోకి తరలించారు.
Read More : చైనా టు ఇండియా : ఢిల్లీలో కరీంనగర్ జ్యోతి