ఆరు గంటలకే మద్యం షాపులకు అనుమతి ఎలా ఇస్తారు? : చంద్రబాబు

Chandrababu Naidu Slams Andhra Pradesh Govt Over Spread Of Covid Strain In Ap

కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించినట్లుగా చంద్రబాబు గుర్తు చేశారు.

కరోనాని కట్టడి చెయ్యాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే మార్గమని, జగన్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లేవారికి పొరుగు రాష్ట్రాలు నిషేదాజ్ఞలు విధిస్తున్నాయని, తమ ప్రజలకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఏపీ పట్ల ఆంక్షలను అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు.

రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పడకల కొరత లేదంటూ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు చంద్రబాబు. పార్టీ పరంగా కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్నామని.. ఆన్‌లైన్‌ ద్వారా వైద్య సూచనలు అందజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్య ధోరణి వీడాలని సూచించారు. కరోనా ఆంక్షల్లో భాగంగా.. ఉదయం ఆరు గంటలకే మద్యం షాపులను తెరవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఆరు గంటలకే మద్యం షాపులకు అనుమతి ఎలా ఇస్తారు? అంటూ ప్రశ్నించారు.