Chandrababu Escape
Chandrababu Escape : టీడీపీ అధినేత చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా.. పంటు బోల్తా కొట్టడంతో టీడీపీ నేతలు గోదావరి నీటిలో పడిపోవడం కలకలం రేపింది. అక్కడే ఉన్న మత్స్యకారులు, సిబ్బంది వెంటనే స్పందించి వరద నీటిలో పడిపోయిన నేతలను కాపాడారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన పంటు ర్యాంపు తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ ఘటనలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రామ్మోహన్, ఎన్ఎస్ జీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు గోదావరి నీటిలో పడిపోయారు.
Boat Accident : చంద్రబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం
అయితే, అప్పటికే చంద్రబాబు మరో బోటులోకి మారడంతో ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నీటిలో పడిపోయిన వారికి సకాలంలో లైఫ్ జాకెట్లు అందించడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
టీడీపీ నేతలు పడవ నుంచి దిగుతున్న సమయంలో వారున్న పడవ ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణలు గోదావరిలో పడిపోయారు. సమీపంలోనే ఉన్న మత్స్యకారులు వెంటనే రంగంలోకి దిగి టీడీపీ నేతలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. నీటిలో పడగానే ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి ఆయ్యానని, ప్రాణం పోయిందని భావించానని అన్నారు. అయితే దేవుడి ఆశీస్సులతోనే తాను బతికి బయటపడ్డానని చెప్పారు. దేవినేనితో పాటు గోదావరిలో పడిపోయిన నేతలు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీపంలోనే జరగడంతో వారికి ఎలాంటి ముప్పు జరగలేదు.