Boat Accident : చంద్రబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో చంద్రబాబుకి ప్రమాదం తప్పింది. సోంపల్లి వద్ద పడవ దిగుతుండగా బోల్తా కొట్టింది. దీంతో 15 మంది టీడీపీ నేతలు వరద నీటిలో పడిపోయారు.

Boat Accident : చంద్రబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం

Boat Accident (1)

Boat Accident : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో చంద్రబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది.

సోంపల్లి వద పడవ దిగుతుండగా ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. దీంతో పడవలోని టీడీపీ నేతలంతా వరద నీటిలో పడిపోయారు. దేవినేని ఉమ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, సత్యనారాయణ, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ నీళ్లలో పడ్డారు. వెంటనే స్పందించిన మత్స్యకారులు వరద నీటిలో పడిపోయిన నేతలను కాపాడారు. టీడీపీ నేత‌ల‌ను నీటిలో నుంచి సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు, సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు.

పడవ ఒడ్డుకు చేరాక అంతా ఒకేసారి దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పడవ ఓవైపుకి ఒరిగింది. మాజీమంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో పలువురు టీడీపీ నేతలు, వారి వ్యక్తిగత సిబ్బంది, గన్ మెన్లు, మీడియా సిబ్బంది నీళ్లలో పడిపోయారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో టీడీపీ నేతలు కొంత షాక్ కి గురయ్యారు. కొందరు వరద నీటిని మింగేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ ఉదయమే ఆయన ఏలూరు చేరుకున్నారు. అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అయోధ్యలంకలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వరద బాధితులకు అందిన సాయంపై చంద్రబాబు ఆరా తీశారు.

గోదావరి వరదల్లో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు చంద్రబాబు. సహాయక శిబిరాల్లో ఉన్న కుటుంబాలను వారి సొంత గ్రామాలకు తరలించడంలో, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని చెప్పారు. ఆకస్మిక వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ తాడేపల్లి ఇంట్లోనే ఉండిపోయారని విమర్శించారు. వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించకపోవడం దారుణం అన్నారు.