Chegondi Harirama Jogaiah Fast : హరిరామ జోగయ్య దీక్ష విరమించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష విరమించారు. నిమ్మ రసం ఇచ్చి హరిరామ జోగయ్యతో దీక్ష విరమింపజేశారు కాపు సంక్షేమ సేన నాయకుడు, జనసేన నేత దాసరి రాము. కాసేపట్లో పాలకొల్లు బయలుదేరనున్న హరిరామ జోగయ్య.
సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 85 ఏళ్ల హరిరామజోగయ్య నిరాహార దీక్షకు దిగడం పట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆసుపత్రిలో కూడా దీక్షను కొనసాగించారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది.
ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ ఎంట్రీ ఇచ్చారు. నిరాహార దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మూర్ఖపు ప్రభుత్వం నిరాహార దీక్షలకు లొంగదని ఆయనకు చెప్పినట్లు పవన్ వివరించారు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని సూచించినట్టు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దీక్షకు దిగిన హరిరామజోగయ్యను పోలీసులు ఆయన కూర్చున్న కుర్చీతో సహా అంబులెన్స్ లోకి ఎక్కించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే.
పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడిన తర్వాత దీక్షను విరమించారు హరిరామ జోగయ్య. దీక్ష ప్రస్తుతానికి విరమించినప్పటికీ.. కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం సాగిస్తానని, త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తానని జోగయ్య ప్రకటించారు.
Also Read..Stampede At Chandrababu Meeting : చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం అదేనా?
”అనుభవజ్ఞులు, వయసులో పెద్ద వారు. మీ లాంటి వారు ఇలాంటి కఠిన నిరాహార దీక్షలు చేయడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. భావి తరాలకు మీ సలహాలు, సూచనలు అవసరం ఉంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యమం మరింత ముందుకు వెళ్తుంది. కాపులకు రిజర్వేషన్ల విషయంలో అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని నిర్మిద్దాం. నేను పర్సనల్ గా మిమ్మల్ని కలిసి దీనిపై చర్చిస్తాను. వెంటనే మీరు దీక్షను విరమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని” హరిరామ జోగయ్యకు పవన్ సూచించారు. పవన్ సూచనతో హరిరామ జోగయ్య దీక్షను విరమించారు.