Chintamaneni Prabhakar : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ అక్రమం కాదు సక్రమమే అన్నారాయన. నోటి దూల వల్లే వంశీకి ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని కామెంట్ చేశారాయన. రాజకీయ జన్మ ఇచ్చిన వారి కుటుంబంపైనే విర్రవీగి మాట్లాడాడు అని వంశీపై విరుచుకుపడ్డారు చింతమనేని ప్రభాకర్.
వంశీ అరెస్ట్ ఎలా అక్రమం అవుతుందో మీరే చెప్పండి అంటూ మీడియా ప్రతినిధిపై చిర్రుబుర్రులాడారు. వైసీపీ అధినేత జగన్ పైనా విరుచుకుపడ్డారు చింతమనేని ప్రభాకర్. జగన్ పాలనలో తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానని వాపోయారు. ఒకానొక సమయంలో ఆస్తులన్నీ అమ్ముకుని తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయే పరిస్థితి తనకు వచ్చిందన్నారు.
”వంశీ అరెస్ట్ అక్రమం కాదు సక్రమమే. వంశీని లోపల వేయడం ధర్మమా కాదా మీడియా వాళ్లే చెప్పాలి. మా పార్టీలో రెండు సార్లు గెలిచాడు. వంశీని మా నెత్తిన పెట్టుకుని తిప్పాం. అలా తిప్పినందుకు మాకు తగిన శాస్తి చేసి వెళ్లాడు. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డారు. అధికార మదంతో వంశీ విర్రవీగాడు. రాజకీయ జన్మనిచ్చిన వారి కుటుంబం పైనే విర్రవీగి మాట్లాడాడు. ఎవరో ప్రేరేపిస్తే మాట్లాడాడు.
ఇదంతా వంశీ నోటి దూలకు వచ్చిన తిప్పలు. మమ్మల్ని నర్సీపట్నం నుంచి వెనక్కి లాగి చింతపల్లి ఫారెస్ట్ లోపల పెట్టి ఎన్ కౌంటర్ చేస్తామన్నారు. నూకలు ఉండి బతికి బయటపడ్డా. జగన్ లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తే మన కర్మ అనుకున్నాం. ఎన్ని నిద్రలేని రాత్రుల గడిపామో. ఈసారి అధికారంలోకి రాకపోతే ఆస్తులన్నీ అమ్మి తట్ట బుట్ట సర్దుకుని పోదాం అనుకునే పరిస్థితి నాలాంటోడికే వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఈ కూటమి ఏర్పడింది. ఇది ప్రజా విజయం” అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
వంశీ జైలుకి వెళ్లడానికి జగనే కారణం- ఎమ్మెల్యే చింతమనేని
”జగన్ ఎందుకు బెంగళూరు వెళ్లారు. వంశీ దగ్గరికి రావొచ్చు కదా. జైలుకి వెళ్లొచ్చు కదా. వంశీ జైలుకి వెళ్లడానికి కారణం జగనే. ఆయన డైరెక్షన్ తోనే తిట్టాడు. జగనే ఉసిగొల్పాడు. ఇవాళ శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? ఆరోజు నోరు ఉంది కదా అని, మీడియా వాళ్లు కెమెరాలు పెట్టారని, మైకులు చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది. తప్పు చేస్తే శిక్ష తప్పదు.
Also Read : ఇప్పుడు వంశీ వంతు.. నెక్స్ట్ కొడాలి నానినేనా? కూటమి సర్కార్ అసలు గేమ్ స్టార్ట్ చేసిందా?
చాలా మంది వైసీపీ నేతలు ఉన్నారు. వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదు. గతంలోనే నేను కూడా జగన్ గురించి మాట్లాడాను కాబట్టే ఫస్ట్ నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారు. జగన్ ని రక్తచరిత్ర అన్నందుకే నన్ను జైల్లో వేశారు. ఇప్పటికీ అదే మాట అంటున్నా. సొంత బాబాయ్ నే చంపాడు” అని జగన్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.