Chintamaneni (Image Credit To Original Source)
Chintamaneni: ఏపీలో పవర్‌లో ఉన్న కూటమిలో టీడీపీది కీరోల్. మామూలుగానే టీడీపీ బలం, బలగం ఎక్కువే. ఇప్పుడు అధికారంలో ఉండటంతో..విపక్ష వైసీపీలో ఉన్న నేతల్లో చాలా మంది సైకిల్ ఎక్కారు. కూటమి పవర్‌లోకి వచ్చిన వెంటనే.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో కీలక పదవుల్లో ఉన్న ఫ్యాన్ పార్టీ లీడర్లు పసుపు కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లే అధికారం చలాయిస్తున్నారట. ఇదే పలువురు తెలుగు తమ్ముళ్లకు గిట్టడం లేదట.
గత ఐదేళ్లు వాళ్ల మీద పోరాడిన తాము..ఇప్పుడు వాళ్ల అజమాయిషీ ఏంటంటూ రగిలిపోతున్నారట. ఇలాంటి క్రమంలోనే పలువురు నేతలు అక్కడక్కడ ఓపెన్ అయిపోతున్నారట. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ది కూడా ఇలాంటి పరిస్థితే అంటున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఓడినా, గెలిచినా కేసులు, ఇబ్బందులు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వెనక్కి వెళ్లకుండా పోరాడుతూ వచ్చారు.
అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనతో ఢీ అంటే ఢీ అని..ఆయనను టార్గెట్ చేసిన పలువురు నేతలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారట. పైగా ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేతో పాటు వాళ్లు వేదికను పంచుకుంటున్నారట. ఇది చింతమనేనికి ఏ మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదట. అందుకే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో ఆయన బరస్ట్ అయ్యారని అంటున్నారు. టీడీపీలో వైసీపీ కోవర్టులు ఉన్నారని..వాళ్లు ఎప్పుడూ ఉంటారో ఎప్పుడూ పోతారో తెలియదంటూ మాట్లాడేశారు చింతమనేని.
Also Read: లోకల్ ఫైట్.. మున్సిపోల్స్.. పవన్ పవర్ స్ట్రాటజీ ఇదే..!
ఇంతకు చింతమనేని ఎవరిని ఉద్దేశించి కోవర్టులు అనే మాట మాట్లాడారనేదానిపై..చాలా డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు మేయర్ వైసీపీలో గెలిచి టీడీపీలో చేరారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు కూడా వైసీపీలో గెలిచి టీడీపీ గూటికి చేరారు. మాజీమంత్రి ఆళ్లనానితో పాటు పలువురు సైకిల్ పార్టీలో ఉన్నారు. అయితే ఇందులో కొందరితో చింతమనేని సర్దుకుపోతున్నా..జడ్పీ ఛైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్‌తో మాత్రం ఆయనకు పొసగడం లేదట.
అప్పట్లో పర్సనల్‌గా టార్గెట్ చేశారా?
చింతమనేని అపోజిషన్‌లో ఉన్నప్పడు.. వైసీపీలో ఉన్న ఘంటా పద్మశ్రీ, ప్రసాద్.. ఆయనను పర్సనల్‌గా టార్గెట్ చేశారట. ఈ క్రమంలోనే టీడీపీలో ఘంటా పద్మశ్రీ దంపతుల చేరికను చింతమనేని వ్యతిరేకించారట. అయినా పార్టీ అధిష్టానం వాళ్లను చేర్చుకోవడంతో ఆవేదనతో రగలిపోతున్నారట చింతమనేని. అంతేకాదు ప్రోటోకాల్ పరంగా జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న గంటా పద్మశ్రీ ప్రసాద్..తమతో పాటు డయాస్ షేర్ చేసుకుంటుండం ఆయనకు ఏ మాత్రం మింగుడు పడట్లేదట.
పైగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే దెందులూరులో రిజర్వేషన్లు మారి..గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు ఎక్కడ తన సీటుకు ఎసరు పెడుతారేమోనన్న ఆందోళన కూడా ఆయనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకే సమయం, సందర్భం దొరికినప్పుడల్లా గంటా పద్మశ్రీ, ప్రసాద్‌లను ఇండైరెక్ట్‌గా టార్గెట్ చేసి..ఇరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారట చింతమనేని.
ఇక జిల్లాలో సీనియర్ నేతగా..పైగా పార్టీ కష్ట కాలంలో నిలబడ్డ తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి కూడా చింతమనేనిలో ఉందంటున్నారు. తనను కాదని పార్ధసారధికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన నిరాశ చెందారట. కాకపోతే అధినేత నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోతున్నారట. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యంలోనే ఏలూరు సభలో..జడ్పీ ఛైర్మన్ గంటా పద్మశ్రీ, మంత్రి పార్ధసారధి ఒకే వేదిక మీదున్నప్పుడు చింతమనేని చేసిన కామెంట్స్ దుమారం లేపాయి.
పార్ధసారథి ఎందుకు రియాక్ట్ అయ్యారు?
అయితే ఎవరిని ఉద్దేశించి ఎమ్మెల్యే కోవర్టులనే వ్యాఖ్యలు చేశారో కానీ..మంత్రి పార్ధసారథి రియాక్ట్ అవడం ఆసక్తికరంగా మారింది. ఆయన వైసీపీ నేతగా ఉండి..గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీంతో చింతమనేని కామెంట్స్‌కు పార్ధసారధికి గుచ్చుకున్నాయని..అందుకే ఆయన స్పందించారని ఓ చర్చ నడుస్తోంది. అయితే అదే రోజు ధర్మాజీగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఓపెనింగ్‌కు మంత్రులు గొట్టి రవికుమార్, పార్థసారధితో పాటు చింతమనేని కూడా హాజరయ్యారు.
సబ్ స్టేషన్ ఓపెనింగ్ వరకు కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని..తన కంటే ముందు ఆ కార్యక్రమ వేదికపై జడ్పీ ఛైర్మన్ గంటా పద్మశ్రీ ఉండటాన్ని గమనించి..కనీసం డయాస్ మీదకు వెళ్లకుండా వెనుదిరిగారు. దీంతో ఆయనకు గంటా పద్మశ్రీ, ప్రసాద్‌తోనే గ్యాప్ ఉందని..ఏలూరు సభలో వారి ఉద్దేశించే కామెంట్స్ చేసి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.